Leading News Portal in Telugu

DRDO Drone Crash: పరీక్షిస్తుండగా పొలాల్లో కుప్పకూలిన డీఆర్‌డీవో డ్రోన్


DRDO Drone Crash: డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో)కి ఆదివారం ఓ చేదువార్త ఎదురైంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో గల ఓ గ్రామంలో డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన తపస్ డ్రోన్ పరీక్షిస్తుండగా కూలిపోయింది. చిత్రదుర్గ జిల్లా హరియూర్‌ తాలుకాలోని వడ్డికెరె గ్రామంలోని పొలాల్లో డ్రోన్‌ కూలిపోయినట్లు రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కూలిన డ్రోన్‌ను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం వెనుక నిర్దిష్ట కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. డ్రోన్ ఖాళీ పొలంలో పడిపోయింది. ప్రస్తుతం ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. గత కొంతకాలంగా డీఆర్‌డీవో మానవరహిత వైమానిక వాహనం(యూఏవీ) అభివృద్ధిపై పరిశోధనలు చేస్తోంది. తపస్‌ పేరుతో రూపొందిస్తున్న ఈ డ్రోన్‌ను ఆదివారం ఉదయం డీఆర్‌డీవో పరీక్షిస్తుండగా కూలిపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదం గురించి రక్షణ శాఖకు సమాచారం అందింది. ఈ ప్రమాదం తర్వాత డ్రోన్‌ విరిగిపోయి దాని పరికరాలు నేలపై చెల్లాచెదురుగా ఉన్నట్లు వీడియోలో చూడవచ్చు. పెద్ద శబ్ధంతో యూఏవీ కూలిన వెంటనే గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

సరిహద్దులను పర్యవేక్షించడానికి, శత్రువులపై దాడి చేయడానికి తపస్ డ్రోన్‌ను డీఆర్‌డీవో అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం భారత సైన్యంలో దీనిని చేర్చలేదు. డీఆర్‌డీవో వెబ్‌సైట్ ప్రకారం, ఈ డ్రోన్ 30 వేల అడుగుల ఎత్తు వరకు ఎగురుతుంది. ఈ స్వదేశీ డ్రోన్ సరిహద్దులను పర్యవేక్షించడానికి అలాగే శత్రువులపై దాడి చేయడానికి ఉపయోగపడుతుంది.