క్రికెట్ లెజెండ్, భారతరత్న సచిన్ టెండూల్కర్ తో ఎన్నికల సంఘం ఒప్పందం కుదుర్చుకోనున్నది. ఎన్నికలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సచిన్‌ను నేషనల్ ఐకాన్‌గా ఈసీ నియమించనున్నది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్ర పాండే మరియు అరుణ్ గోయెల్ సమక్షంలో టెండూల్కర్ తో బుధవారం ఒప్పందం కుదుర్చుకోనుంది.
రాబోయే ఎన్నికల్లో యువతకు ఓటింగ్‌పై అవగాహన కల్పించేందుకు సచిన్ పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌గా సచిన్ ఓటర్ల చైతన్య ప్రచారం నిర్వహిస్తారని ఈసీ తెలిపింది. అనేక రంగాలకు చెందిన మేటి వ్యక్తుల్ని నేషనల్ ఐకాన్స్‌గా ఈసీ తమ ప్రచారం కోసం నియమించుకుంటోంది. గతంలో పంకజ్ త్రిపాఠి, ఎంఎస్ ధోనీ, ఆమిర్ ఖాన్, మేరీ కోమ్‌లను కూడా ఎన్నికల ప్రచారం కోసం ఈసీ వాడుకున్న విషయం తెలిసిందే.
సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో 200 టెస్ట్ మ్యాచ్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఇది సాటిలేని రికార్డు. టెండూల్కర్ 664 మ్యాచ్‌లలో 48.52 సగటుతో మరియు 67 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 100 సెంచరీలు, 164 అర్ధసెంచరీలతో 34,357 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు కూడా. అంతేకాకుండా.. ఆరు ప్రపంచ కప్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అతను 2011 ప్రపంచ కప్ గెలవడంలో కీలక బాధ్యత వహించాడు.