ఉత్తరాఖండ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు జనాలు అతలాకుతలం అవుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇప్పటికే కొండచరియలు విరిగిపడి చాలా మంది వరకు చనిపోయారు. మరోవైపు అధిక వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లో విపత్తు లాంటి పరిస్థితి నెలకొందని, ఇప్పటివరకు రాష్ట్రానికి రూ. 1,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం చెప్పారు. భారీ వర్షాలతో పంటలను నాశనం అయ్యాయని.. రోడ్లు, వంతెనలు, ఇళ్ళు మరియు గోశాలలు కొట్టుకుపోయాయని తెలిపారు. అంతేకాకుండా అనేక మంది ప్రజలు, పశువుల ప్రాణాలను కూడా బలిగొన్నాయని ఆయన పేర్కొన్నారు.
రూ.1,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయని.. అంతేకాకుండా ఇంకా రాష్ట్రంలో వర్షాలు భారీగానే కురుస్తున్నాయని పుష్కర్ సింగ్ ధామి చెప్పారు. ఉత్తరాఖండ్‌లో వర్షాల వల్ల సంభవించిన విపత్తులలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకునేందుకు, బాధిత ప్రజలకు పునరావాసం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఒక పథకాన్ని ప్రవేశపెడుతుందని ఆయన చెప్పారు. కేంద్రం నుంచి వచ్చిన బృందం ఇప్పటికే ప్రాథమిక సర్వే చేసిందని, విపత్తు వల్ల సంభవించిన నష్టాలను సమగ్రంగా అంచనా వేస్తుందని పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని నగరాల్లో పెరుగుతున్న పర్యాటకుల లోడ్‌కు సంబంధించిన ప్రశ్నకు సమాధానమిస్తూ, రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఇప్పటికే దాని ప్రధాన పర్యాటక పట్టణాల భారాన్ని మోసే సామర్థ్యాన్ని అధ్యయనం చేసే పనిలో ఉందని చెప్పారు.