Leading News Portal in Telugu

Uttar Pradesh: ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు..89 మంది బాలికలు మిస్సింగ్


ఉత్తరప్రదేశ్ లోని పరస్‌పూర్‌లోని కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో 89 మంది బాలికలు అదృశ్యమయ్యారు. మొత్తం అక్కడ 100 మంది బాలికలు ఉండగా.. 11 మంది విద్యార్థినులు మాత్రమే ఉన్నారు. దీంతో వార్డెన్‌తో సహా నలుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే రాత్రి జిల్లా మేజిస్ట్రేట్ నేహా శర్మ ఆకస్మిక తనిఖీలు చేపట్టగా ఈ విషయం బయటపడింది.

కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో 89 మంది బాలికల మిస్సింగ్ పై వార్డెన్ సరితా సింగ్‌ సమాధానం చేయలేకపోయింది. ఇంత తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తున్నారని.. రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలు ఈ పద్ధతిలో నడపకూడదు అని DM మండిపడ్డారు. దీంతో ఆమెపై కూడా FIR నమోదు చేస్తామని తెలిపారు.

జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు పాఠశాల వార్డెన్, ఫుల్‌టైమ్ టీచర్, వాచ్‌మెన్, ప్రాంతీయ రక్షా దళ్ (పీఆర్‌డీ) జవాన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు జిల్లా ప్రాథమిక శిక్షా అధికారి (బీఎస్‌ఏ) ప్రేమ్ చంద్ యాదవ్ తెలిపారు. మరోవైపు సంబంధిత సెక్షన్ల కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటామన్నారు. విధుల్లో ఉన్న గార్డుపై శాఖాపరమైన చర్యల కోసం జిల్లా యువజన సంక్షేమ అధికారికి ప్రత్యేక లేఖ రాయడం జరిగిందని జిల్లా ప్రాథమిక శిక్షా అధికారి తెలిపారు.