Leading News Portal in Telugu

G20 Summit: జీ-20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ దూరం.. క్రెమ్లిన్‌ ప్రకటన


G20 Summit: సెప్టెంబర్‌లో భారత్‌లో జరగనున్న జీ20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరుకావడం లేదు. పుతిన్ భారత్‌కు రాలేరని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ధృవీకరించారు. అదే సమయంలో విమాన ప్రమాదంలో యెవ్జెనీ ప్రిగోజిన్ మరణంలో క్రెమ్లిన్ ప్రమేయం ఉందన్న ఆరోపణలు పూర్తిగా అబద్ధమని ఆయన అన్నారు. ప్రిగోజిన్ మరణం వెనుక క్రెమ్లిన్ ఉందని పాశ్చాత్య దేశాలు చెబుతున్నాయని, ఇది పూర్తిగా అబద్ధమని పెస్కోవ్ చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ జి-20 శిఖరాగ్ర సమావేశానికి భారత్‌కు రావడం లేదని, ఉక్రెయిన్ యుద్ధమే కారణమని పేర్కొంది. జీ-20 సదస్సు కోసం పుతిన్‌ భారత్‌లో పర్యటించేందుకు ఎలాంటి ప్రణాళికలు లేవని.. తమ దృష్టంతా ప్రస్తుత సైనిక చర్య పైనే ఉంది దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో జరగనున్న జీ20 సదస్సుకు వ్యక్తిగతంగా హాజరయ్యే ఆలోచన లేదని క్రెమ్లిన్ శుక్రవారం తెలిపిందని రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడ్డారని అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ICC) ఆయనపై వారెంట్ జారీ చేసిన తర్వాత పుతిన్ విదేశాలకు వెళ్లినప్పుడు అరెస్టు చేసే ప్రమాదం ఉంది. దీంతో ఆయన విదేశాలకు వెళ్తే అరెస్టయ్యే ముప్పు ఉంది. ఐసీసీ సభ్యదేశంగా ఉన్న దక్షిణాఫ్రికా.. ఒకవేళ పుతిన్‌ తమ దేశానికి వస్తే ఆయనను అరెస్టు చేయాల్సి ఉంటుంది. ఈ కారణం వల్లనే ఆయన.. బ్రిక్స్‌ సదస్సుకు హాజరుకాలేదు. వీడియో లింక్ ద్వారా దక్షిణాఫ్రికాలో ఇటీవల ముగిసిన బ్రిక్స్ సదస్సుకు పుతిన్ హాజరయ్యారు. కాగా.. గతేడాది ఇండోనేషియాలో జరిగిన జీ-20 సదస్సుకు కూడా పుతిన్‌ గైర్హాజరయ్యారు.

ప్రస్తుత G20 సమ్మిట్‌కు భారతదేశం ఆతిథ్యం ఇస్తోంది. ప్రధాన కార్యక్రమం సెప్టెంబర్ 9-10 తేదీలలో న్యూఢిల్లీలో జరగనుంది. సమ్మిట్‌కు 29 మంది దేశాధినేతలతో పాటు ఈయూ ఉన్నతాధికారులు, ఆహ్వానిత అతిథి దేశాలు, 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరయ్యే అవకాశం ఉంది. న్యూఢిల్లీ సమ్మిట్ ముగింపులో జీ20 లీడర్స్ డిక్లరేషన్ ఆమోదించబడుతుంది.