Leading News Portal in Telugu

ISRO Scientists: ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు బెంగళూరుకు వెళ్లనున్న ప్రధాని


ISRO Scientists: చంద్రునిపైకి విజయవంతంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌పై ఇస్రో బృందానికి అభినందనలు తెలిపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం బెంగళూరుకు రానున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని మోడీ అభినందించనున్నారు. చంద్రయాన్‌-3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై విజయవంతంగా దిగిన సమయంలో భారత్‌లో లేని ప్రధాని మోడీ.. ఈ అద్భుత ఘట్టాన్ని వర్చువల్‌గా తిలకించారు. అయితే విదేశాల నుంచి తిరిగి రాగానే ఇస్రో శాస్త్రవేత్తల వద్దకు వెళ్లి అభినందనలు తెలపనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సైంటిస్టులను స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రధాని మోడీ శనివారం కర్ణాటకలో పర్యటించనున్నారు. ప్రధాని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ (ISTRAC) వద్ద ఒక గంట గడపనున్నారు. అనంతరం ఇస్రో శాస్త్రవేత్తలతో భేటీ కానున్నారు. బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రధానికి స్వాగతం పలకనున్నారు. ఉదయం 7గంటల నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఆ తర్వాత ఉదయం 8.05 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి 8.35 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ క్రమంలోనే ప్రధాని పర్యటనకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.