Leading News Portal in Telugu

Accident: ఘోర ప్రమాదం.. జీపు లోయలో పడి తొమ్మిది మంది కూలీలు దుర్మరణం


Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 12 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ జీప్ వయనాడ్‌ సమీపంలోని మనంతవాడిలోని తవిన్‌హాల్ గ్రామ పంచాయతీలో లోయలో పడింది. ఈ ఘటనలో జీప్‌లో ఉన్న తొమ్మిది మంది కూలీలు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జీప్ డ్రైవర్‌తో సహా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది సమాచారం అందుకున్న పోలీసులు, రెస్య్కూ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించాయి. మృతుల సంఖ్యను జిల్లా కలెక్టర్ ధృవీకరించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం లో చనిపోయిన వారంతా టీ ఎస్టేట్ కంపెనీలో పని చేస్తోన్న కూలీలుగా పోలీసులు గుర్తించారు.

మృతులు రాణి, శాంత, చిన్నమ్మ, లీల, షాజబాబు, రబియా, మారి, వసంతతో పాటు మరో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందారని అధికారులు గుర్తించారు. లత, ఉమాదేవి, మణి (డ్రైవర్) తీవ్రంగా గాయపడ్డారు. మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో కూలీలు ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వంకరగా ఉన్న మార్గం గుండా వెళుతుండగా వాహనం లోయలో బోల్తా పడినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో జీపు పూర్తిగా ధ్వంసమైనట్లు స్థానికులు తెలిపారు.