Leading News Portal in Telugu

PM Modi: మన్ కీ బాత్ లో తెలుగు భాష గురించి ప్రస్తావించిన ప్రధాని మోడీ


మన్‌కీ బాత్‌ 104వ ఎపిసోడ్‌లో భాగంగా నేడు ( ఆదివారం ) ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రయాన్‌-3 భారత్‌ విజయానికి ఎప్పటికీ ప్రతీకగా నిలుస్తుందని కొనియాడారు. కాగా, చంద్రయాన్‌-3 ప్రాజెక్టు మహిళా సాధికారతకు చిహ్నంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. భారత్‌ వచ్చే నెల ఢిల్లీలో జీ-20 సమావేశాలకు రెడీ అవుతుందని.. గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 40 దేశాలకు చెందిన ప్రతినిధిలు వస్తున్నారని వెల్లడించారు. తొలిసారి భారత్‌ జీ-20కి నేతృత్వం అంటే.. ప్రజలే అధ్యక్షత వహిస్తున్నట్లు భావించాలని ప్రధాని మోడీ చెప్పారు.

ఇక, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన భాష సంస్కృతం.. యోగ, ఆయుర్వేదం, ఫిలాసఫీ వంటి అంశాలపై చాలా మంది అధ్యయనం చేస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామం అని ప్రధాని అన్నారు. సంస్కృత భాషను నేర్చుకునేందుకూ చాలా మంది ఆసక్తి చూపుతుండటం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలను ప్రధాని మోడీ తెలిపారు. తెలుగు భాష కూడా చాలా ప్రత్యేకమైంది.. సంస్కృతం లాగానే తెలుగు కూడా అతి పురాతనమైన భాష.. ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకోబోతున్నామని ఆయన పేర్కొన్నారు.

అయితే, నేడు భారత్‌ క్రీడల్లో నిలకడగా విజయాలు సాధిస్తోంది అని ప్రధాని మోడీ తెలిపారు. తాజాగా చైనాలో జరిగిన ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల్లో రికార్డు స్థాయిలో మనవాళ్లు పతకాలను సాధిస్తున్నారన్నాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘మేరీ మాటి.. మేరీ దేశ్‌’ కార్యక్రమం జోరుగా కొనసాగుతుందని మోడీ అన్నాడు. సెప్టెంబర్‌ నెలలో దేశ వ్యాప్తంగా ప్రతి ఇల్లు, ప్రతి గ్రామం నుంచి మట్టి నమూనా సేకరించే కార్యక్రమం ఉద్యమ స్థాయిలో జరుగుతుందని ప్రధాని మన్‌కీ బాత్‌లో పేర్కొన్నారు.