
సాధారణంగా పిల్లలను అమ్మేయడానికో, బిక్షాటన చేయించడానికో కిడ్నాప్ చేస్తూ ఉంటారు. వీధుల్లో ఆడుకుంటున్న పిల్లలను, స్కూల్ నుంచి వస్తున్న వారిని, ఫుట్ పాత్ పై పడుకున్న వారిని కిడ్నాప్ చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఢిల్లీకి చెందిన ఓ జంట ఫుట్ పాత్ పై పడుకున్న నెల రోజుల పసికందును కిడ్నాప్ చేసింది. పోలీసుల విచారణలో కిడ్నాప్ చేయడానికి గల కారణాన్ని వారు వివరించారు. అది విన్న పోలీసులే విస్తుపోయారు. ఇలా కూడా కిడ్నాప్ చేస్తారా అనుకుంటూ వారిపై కేసు నమోదు చేశారు .
అసలు విషయంలోకి వెళితే ఢిల్లీకి చెందిన సంజయ్ గుప్తా, అనిరా గుప్తా భార్యభర్తలు. వారికి ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారు. వాళ్ల కొడుకు టెర్రస్ పై నుంచి పడి చనిపోయాడు. అయితే ఈ విషయాన్ని వారు తమ 17 ఏళ్ల కుమార్తె దగ్గర దాచిపెట్టారు. రాఖీ పండుగ వస్తూ ఉండటంతో వారి కుమార్తె సోదరుడికి రాఖీ కట్టాలని పట్టుబట్టింది. దీంతో సోదరుడి మరణ వార్త ఆమెకు ఎక్కడ తెలుస్తుందో అని భయపడ్డారు తల్లిదండ్రులు. అంతేకాకుండా ఎవరైనా కూతురు అడిగితే ఏ చాక్లెటో, డ్రెస్సో, నగలో కొనిస్తారు. కానీ ఈ తల్లిదండ్రులు మాత్రం సోదరుడికి రాఖీ కట్టాలన్న ఆమె కోరికను తీర్చాలని ఆశ పడ్డారు. దాంతో ఏకంగా వారు ఏ తల్లిదండ్రులు చేయకూడని పని చేశారు. ఫుట్ పాత్ పై తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న ఓ నెలరోజుల పసికందును కిడ్నాప్ చేశారు.
Also Read: Fake Pilot: అమ్మాయిల కోసమే పైలెట్ అవతారం.. పలువురిని మోసం చేసిన యువకుడు
అయితే తమ కుమారుడు కనిపించకపోవడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫుట్ పాత్ దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఎవరో ఆడమనిషి వెనుక కూర్చోగా ఇద్దరు మగ వ్యక్తలు ఉన్న బైక్ ఆ ప్రాంతంలో పలుసార్లు చక్కర్లు కొట్టినట్లు గమనించారు. వారి బైక్ నెంబర్ ఆధారంగా ట్రేస్ చేసి వారిని ఢిల్లీకి చెందిన సంజయ్ గుప్తా, అనిరా గుప్తాలుగా గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి విచారించగా తమ కుమార్తె రాఖీ కట్టాలన్న కోరికను తీర్చేందుకే తాము కిడ్నాప్ చేశామని తెలిపారు. దీంతో షాక్ అయిన పోలీసులు వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని నార్త్ ఢిల్లీ డీజీపీ సాగర్ సింగ్ కల్సీ తెలిపారు.