Leading News Portal in Telugu

West Bengal: బాణాసంచా పేలుడుపై ఎన్‌ఐఏ దర్యాప్తు జరిపించాలి.. అమిత్ షాకు లేఖ


పశ్చిమ బెంగాల్‌లోని దుత్తాపుకూర్‌లో ఆదివారం ఉదయం బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రమాద ఘటనపై పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ సుకాంత మజుందార్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ ప్రమాదంపై NIA తో విచారణ జరిపించాలని అందులో కోరారు. ఈ ప్రమాదంపై తాను తీవ్ర ఆందోళనతో, బరువెక్కిన హృదయంతో లేఖ రాస్తున్నానని మజుందార్ తెలిపారు. ఈ ప్రమాద ఘటన భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించాయి. దీనిపై సమగ్ర, న్యాయమైన దర్యాప్తు తప్పనిసరి చేయించాలని.. విషాద సంఘటనల వెనుక కారణాలను తెలుసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

ఈ పేలుడు ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని.. మృతుల సంఖ్య పెరగవచ్చని తెలిపారు. ఈ సంఘటన చాలా ఆందోళన కలిగిస్తుందని.. ఈ అక్రమ ఫ్యాక్టరీల గురించి స్థానిక నివాసితులు పోలీసులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ, వాటిపై దృష్టి పెట్టలేదన్నారు. తాను సమగ్ర, వివరణాత్మక దర్యాప్తును నిర్వహించాలని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)ని అభ్యర్థిస్తున్నానని తెలిపారు. ఈ పేలుళ్లకు సంబంధించి ఏదైనా ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన అవకాశంతో సహా అన్ని కోణాల్లో నిష్పక్షపాత దర్యాప్తును ఆదేశించాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నానని మజుందార్ పేర్కొన్నారు.

అంతకుముందు.. ప్రతిపక్ష నేత సువేందు అధికారి మాట్లాడుతూ, “ఈ ఫ్యాక్టరీ మాత్రమే కాదు, రాష్ట్రం మొత్తం ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ అక్రమ ఫ్యాక్టరీలను మూసివేయాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెద్ద మాటలు చెప్పారని.. కానీ వారు దొంగలను రక్షించడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలోని ఇమామ్‌లతో సమావేశాలు నిర్వహించడం.. మతతత్వ కార్డును ప్లే చేయడమే వారి పని అని ఆయన దుయ్యబట్టారు.