Leading News Portal in Telugu

Geetika Srivastava: పాక్‌లో భారత తొలి మహిళా డిప్యూటీ హైకమిషనర్‌గా గీతికా శ్రీవాత్సవ..


Geetika Srivastava: భారత్-పాకిస్థాన్ మధ్య దౌత్య స్థాయిలో సంబంధాలపై కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. దానికి కారణమేమిటంటే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గీతిక శ్రీవాస్తవ పాకిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయానికి ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం అక్కడ విధుల్లో ఉన్న సురేశ్‌ కుమార్‌ పదవీ కాలం పూర్తయిన అనంతరం ఆమె ఈ మేరకు బాధ్యతలు స్వీకరించనున్నారు. దాయాది దేశమైన పాక్‌లో ఈ పదవి చేపట్టనున్న తొలి మహిళా అధికారిగా ఆమె నిలిచారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గీతికా శ్రీవాస్తవ ఇస్లామాబాద్‌లో భారత విదేశాంగ శాఖ కీలక అధికారిగా ప్రధాన పాత్ర పోషించనున్నారు. భారత్‌లో కొత్త ఇన్‌ఛార్జ్‌గా సాద్ వారియాచ్‌ను పాకిస్తాన్ నియమించిన సమయంలో గీతిక నియామకం జరిగింది. పాకిస్థాన్ హైకమిషన్‌లో ఐజాజ్ ఖాన్ స్థానంలో సాద్ వారియాచ్‌ నియమితులయ్యారు.

ఆగస్టు 5, 2019న భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన వెంటనే రెండు పొరుగు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తదనంతరం భారత్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ నిరసనను తెలియజేసేందుకు పాకిస్థాన్‌ భారత హైకమిషనర్ పదవి నుంచి అజయ్ బిసారియాను సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి ఇస్లామాబాద్‌లోగానీ, న్యూఢిల్లీలోగానీ పూర్తిస్థాయి హైకమిషనర్ లేరు. హైకమిషనర్‌ లేనిపక్షంలో డిప్యూటీ హైకమిషనర్లే మిషన్‌కు బాధ్యత వహిస్తారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భారత్‌, పాకిస్థాన్‌ చరిత్రలో దౌత్యంలో మహిళలు ముఖ్యమైన పాత్ర పోషించారు. కాలక్రమేణా దౌత్య ప్రయత్నాలలో, చర్చలలో మహిళలను చేర్చుకోవడం వారి ప్రాముఖ్యతకు గుర్తింపు పెరుగుతోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన తరుణంలో గీతిక పాకిస్థాన్‌లో పర్యటించనున్నారు. గీతిక భారతదేశంలోని అగ్రశ్రేణి మహిళా దౌత్యవేత్తల క్లబ్‌లో మరొక సభ్యురాలు. ఆమె నియామకానికి ముందు, పాకిస్తాన్‌లో బ్రిటన్ మొదటి మహిళా హైకమిషనర్ కూడా బాధ్యతలు స్వీకరించారు.

చక్కటి కెరీర్
గీతిక దాదాపు 20 ఏళ్ల క్రితం దౌత్యవేత్తగా తన కెరీర్‌ను ప్రారంభించింది. 2005 బ్యాచ్‌కు చెందిన ఈ ఐఎఫ్‌ఎస్‌ అధికారికి దౌత్యరంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఆమె చైనాలో మొదటిసారిగా సెక్రటరీగా నియమించబడ్డారు. చైనీస్ భాష మాండరిన్‌పై ఆమెకు మంచి పట్టు ఉంది. ఆమె విదేశాంగ కార్యాలయంలో ఇండో-పసిఫిక్ విభాగానికి జాయింట్ సెక్రటరీగా కూడా ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గీతిక కోల్‌కతాలో ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిగా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఐఓఆర్ విభాగంలో డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.