మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని ఓ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిన ఘటన వెలుగు చూసింది. ఉమ్డి గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో 160 మందికి పైగా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవడంతో ఆస్పత్రి పాలయ్యారు. ఓ కార్యక్రమంలో ఆహారం తిన్న ఈ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో వాంతులు చేసుకున్నారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో జరిగింది.
అర్థరాత్రి విద్యార్థుల ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే వైద్యబృందం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ ఘటనపై ఐదు నుండి 15 సంవత్సరాల వయస్సు గల బాధిత విద్యార్థులందరి పరిస్థితి నిలకడగా ఉందని, వారికి ప్రమాదమేమీ లేదని జిల్లా కలెక్టర్ రాజా దయానిధి తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై సాంఘిక సంక్షేమ శాఖ విచారణకు కలెక్టర్ ఆదేశించారు.
ఉమ్డి గ్రామం సాంగ్లీ జిల్లాలోని జాట్ పట్టణానికి 60 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ సమత అనే ఆశ్రమ పాఠశాల ఉంది. ఈ ఆశ్రమ పాఠశాలలో ప్రస్తుతం 150 నుంచి 200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆశ్రమ పాఠశాలలో పిల్లల వయస్సు ఐదు సంవత్సరాల నుండి పదిహేనేళ్ల వరకు ఉంటుంది. విద్యార్థులంతా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన వారే. ఆదివారం ఉమ్‌డి గ్రామంలో కుటుంబ సమేతంగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం తర్వాత మిగిలిపోయిన ఆహారాన్ని సమతా ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అందించినట్లు చెబుతున్నారు. ఆ ఆహారం తిన్న విద్యార్థులు కొద్దిసేపటికే వాంతులు, తలనొప్పి వచ్చినట్లు పాఠశాల యాజమాన్యం తెలుపుతుంది.