Leading News Portal in Telugu

Delhi: “మీరెందుకు పాకిస్తాన్ వెళ్లలేదు”.. విద్యార్థులపై టీచర్ మతపరమైన వ్యాఖ్యలు..


Delhi: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్‌లో ఓ స్కూళ్లో టీచర్ ఆదేశించడంతో ముస్లిం విద్యార్థిని, మరికొందరు విద్యార్థులు చెంపపై కొట్టడం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. త్రిప్తా త్యాగి అనే ఉపాధ్యాయురాలు చేసిన ఈ పనిపై విమర్శలు వెళ్లువెత్తాయి. అయితే ఈ చర్యలో ఎలాంటి మతపరమైన విద్వేషం లేని సదరు ఉపాధ్యాయురాలు చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే ఢిల్లీలోని ఓ పాఠశాలలో ఓ టీచర్ మతపరమైన వ్యాఖ్యలు చేసిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నలుగురు విద్యార్థులను ఉద్దేశిస్తూ.. దేశ విభజన సమయంలో పాకిస్తాన్ ఎందుకు వెళ్లలేదు..? అని టీచర్ ప్రశ్నించారు. ఇప్పుడు ఇది వివాదాస్పదం అయింది. ఢిల్లీ గాంధీనగర్ లోని ప్రభుత్వం సర్వోదయ బాల విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు హేమా గులాటీ అనే ఉపాధ్యాయురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఆరోపణలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

హేమా గులాటి బుధవారం మతపరమైన వ్యాఖ్యలు చేశారు. మక్కాలోని ప్రవిత్రమైన రాతి భవనం కాబాపై, ఖురాన్ పై ఆమె అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విభజన సమయంలో మీరు పాకిస్తాన్ ఎందుకు వెళ్లలేదు, మీరు భారతదేశంలో ఎందుకు ఉన్నారు, భారతదేశ స్వాతంత్య్రంలో మీ సహాకారం లేదని వ్యాఖ్యానించినట్లు ఆరోపించారు.

ఇలాంటి వ్యాఖ్యలు పాఠశాలల్లో విభేదాలకు కారణం అవుతాయని వెంటనే టీచర్ని బర్తరఫ్ చేయాలని విద్యార్థుల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆమెపై చర్యలు తీసుకోకుంటే మరికొందరు ఇలాంటి వ్యాఖ్యలే చేస్తారని సదరు కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆప్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ బాజ్‌పాయ్ టీచర్ తీరును తప్పుపట్టారు. ఇలాంటివి పిల్లల్ని తప్పుదోవ పట్టిస్తాయని, ప్రార్థనా స్థలంపై కించపరిచే వ్యాఖ్యలు చేయకూడదని, అలాంటి వారిని అరెస్ట్ చేయాలని అన్నారు.