INDIA vs NDA: 2024 లోక్‌సభ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎదుర్కొనేందుకు ఇప్పటికే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆప్, ఆర్జేడీ, ఎస్పీ, జేడీయూ వంటి 26 పార్టీలు ఇండియా పేరుతో కొత్త కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. పాట్నాలో ఇండియా తొలిసమావేశం జరగగా.. బెంగళూర్ లో రెండో సమావేశం జరిగింది. తాజాగా సెప్టెంబర్ 1న ముంబై వేదికగా మూడో సమావేశానికి ఇండియా కూటమి సిద్ధం అవుతోంది.
తమ సత్తాను చాటాలని ఇండియా కూటమి ఉవ్విళ్లూరుతోంది. ప్రస్తుతం ఇండియా కూటమిలో 26 పార్టీలు ఉంటే, ముంబై సమావేశంలో ఇండియా కూటమిని మరింతగా విస్తరించాలని నేతలు అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇండియా కూటమికి ధీటుగా ఎన్డీయే తన బలాన్ని ప్రదర్శించాలని అనుకుంటోంది. ముంబూ వేదికగా ఎన్డీయే కూటమిలోకి అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీని ఆహ్వానించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.
ఇటీవల శరద్ పవార్ ని కాదని అజిత్ పవార్ మెజారిటీ ఎన్సీపీ ఎమ్మెల్యేలతో శివసేన(షిండే)- బీజేపీ ప్రభుత్వంలో చేరారు. అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవి చేపట్టారు. అయితే శరద్ పవార్ మాత్రం ఇప్పటికీ ఇండియా కూటమిలోనే ఉన్నట్లు ప్రకటించారు. గతంలో బెంగళూర్ లో జరిగిన ఇండియా సమావేశం రోజునే ఢిల్లీలో ఎన్డీయే కూటమి బలప్రదర్శనకు దిగింది. మళ్లీ సెప్టెంబర్ 1న ఇరు కూటములు ముంబైలో బలప్రదర్శన చేయనున్నాయి.
ఎన్డీయేలో కొత్తగా చేరిన అజిత్ పవార్, అతని ఎన్సీపీ వర్గానికి ముంబైలో ఎన్డీయే కూటమి గ్రాండ్ వెల్కమ్ చెప్పనుంది. ఈ సమావేశంలో బీజేపీ, ఏక్ నాథ్ షిండే శివసేన, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం పాల్గొనబోతున్నాయి.
మరోవైపు ఇండియా కూటమి ముంబై సమావేశంలో ఉమ్మడి లోగోను ఆవిష్కరించే అవకాశం ఉంది. రాష్ట్రాల్లో సీట్ల పంపకంపై కూడా చర్చించవచ్చు. కేజ్రీవాల్, నితీష్ కుమార్, మమతా బెనర్జీ, శరద్ పవార్, స్టాలిన్, అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ, ఒమర్ అబ్ధుల్లా వంటి బీజేపేతర నేతలు ఈ సమావేశానికి హాజరవ్వనున్నారు.