Leading News Portal in Telugu

Triple talaq: విద్యార్థుల ముందే భార్యకు ట్రిపుల్ తలాక్..


Triple talaq: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ట్రిపుల్ తలాక్ కేసు నమోదైంది. భారత ప్రభుత్వం దీన్ని నిషేధించినప్పటికీ కొందరు ట్రిపుల్ తలాక్ చెబుతున్నారు. తాజాగా యూపీ బారాబంకీకి చెందిన ఓ వ్యక్తి కట్నం డిమాండ్ చేస్తూ.. తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు.

తమన్నా అనే స్కూల్ టీచర్ 2020లో షకీల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత నుంచి షకీల్ కట్నాన్ని డిమాండ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల స్కూళ్లో తన విద్యార్థులకు పాఠాలు చెబుతున్న సమయంలో షకీల్ వారి ముందే భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పెళ్లయిన కొంత కాలం తర్వాత అత్తమామలు తమన్నాని రూ. 2 లక్షల కట్నంగా తీసుకురావాలని వేధించడం ప్రారంభించారు. అయితే ఎలాంటి సమాచారం లేకుండా షకీల్ సౌదీ అరేబియా వెళ్లిపోయాడు. దీని తర్వాత భర్త వెళ్లిపోయిన విషయంపై తమన్నా అత్తామామలతో పోరాడింది. తన భర్తను తిరిగి రావాలని కోరింది. ప్రస్తుతం తమన్నా తల్లిదండ్రుల వద్దే ఉంటోంది.

ఆ తరువాత తమన్నా ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం సంపాదించింది. అయితే హఠాత్తుగా సౌదీ నుంచి వచ్చిన షకీల్, తమన్నా పనిచేసే స్కూల్ కి వెళ్లాడు. క్లాస్ చెబుతున్న సమయంలోనే తమన్నాకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. తమన్నా ఫిర్యాదు మేరకు షకీల్ పై వరకట్న వేధింపుల కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.