Leading News Portal in Telugu

Nitish Kumar: ముందస్తు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు.. ఎప్పుడైనా ఎన్నికలు జరగొచ్చన్న నితీష్


బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ క్షణమైనా పార్లమెంటు ఎన్నికలు రావొచ్చని అన్నారు. దేశంలో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో నితీశ్ కుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. వాస్తవానికి 2024లో లోక్ సభ ఎన్నికలు జరగాల్సి ఉందని, కానీ షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరిగే అవకాశముందని పేర్కొన్నారు.

“ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుపుతారన్న గ్యారెంటీ లేదు… ఎప్పుడైనా ఎన్నికలు జరగొచ్చు” అని నితీష్ కుమార్ జోస్యం చెప్పారు. విపక్షాల ఐక్యత నేపథ్యంలో తమకు మరింత నష్టం తప్పదని అంచనా వేసుకుంటున్న ఎన్డీయే ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతోందని నితీశ్ కుమార్ వెల్లడించారు. ముందస్తు ఎన్నికలపై నితీశ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. జూన్ లో విపక్షాల సమావేశానికి ముందు కూడా ఎన్నికలపై స్పందించారు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో ఎవరికి తెలుసు? ఎన్నికలు వచ్చే ఏడాదే నిర్వహించాలని లేదు అని వ్యాఖ్యానించారు.

అటు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీ ఈ ఏడాది డిసెంబరులో ఎన్నికలు జరుపుతుందని నాకు అనుమానంగా ఉంది అని ఆమె తెలిపారు. ఒకవేళ డిసెంబరు కాకపోతే జనవరిలో జరపొచ్చు అని వెల్లడించారు.