Leading News Portal in Telugu

Chandrayaan-3: చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు.. కీలక విషయాలు బయటపెట్టిన ఇస్రో


చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోందని ఇస్రో ప్రకటించింది. అంతేకాకుండా మిషన్‌లో భాగంగా దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన ప్రజ్ఞాన్‌ రోవర్‌ పలు కీలక సమాచారాన్ని సేకరించింది. ఇప్పటికే తాను సేకరించిన విషయాలన్నింటినీ ఇస్రోకు పంపిస్తోంది. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, అక్కడి వాతావరణం ఎలా ఉందన్న విషయాలకు చెందిన సమాచారాన్ని ఇస్రోకు చేరవేసింది. తాజాగా.. చంద్రుడిపై ఆక్సిజన్‌ ఆనవాళ్లు ఉన్నాయని కనుగొన్నది. అలాగే చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద సల్ఫర్‌ ఉనికిని తొలిసారి గుర్తింంచినట్లు తెలిపింది. వీటితో పాటు ఇంకొన్ని ఖనిజాలు ఉన్నట్లుగా ప్రజ్ఞాన్‌ రోవర్‌ గుర్తించింది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో ) ట్విట్టర్‌ వేదికగా తెలిపింది.

చంద్రుడి ఉపరితలంలో అల్యూమినియం ( Al ), కాల్షియం (Ca), ఐరన్‌(Fe), క్రోమియం ( Cr), టైటానియం (Ti), మాంగనీస్ (Mn)‌, సిలికాన్ (Si)‌, ఆక్సిజన్‌ (O)ను కూడా కనుగొన్నట్లు ప్రజ్ఞాన్‌ రోవర్‌ పేర్కొంది. చంద్రుడిపై మట్టి, రాళ్లను అధ్యయనం చేసేందుకు, అక్కడి రసాయన, ఖనిజాలను పరిశోధించేందుకు లిబ్స్‌ ( లేజర్‌ ఇండ్యూస్డ్‌ బ్రేక్‌డౌన్‌ స్పెక్ట్రోస్కోప్‌) అనే పరికరాన్ని ప్రజ్ఞాన్‌ రోవర్‌కు ఇస్రో శాస్త్రవేత్తలు అమర్చారు. ఆ పరికరమే చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఉన్న ఖనిజాలను గుర్తించింది. హైడ్రోజన్‌ కోసం కూడా శోధన కొనసాగుతుందని ఇస్రో ట్వీట్ చేసింది. ప్రజ్ఞాస్‌ రోవర్‌లో అమర్చిన లిబ్స్‌ పరికరాన్ని బెంగళూరుకు చెందిన ల్యాబరేటరీ ఫర్‌ ఎలక్ట్రో ఆప్టిక్స్‌ సిస్టమ్‌ డెవలప్‌ చేసిందని తెలిపింది.

దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ ఉపరితల ఉష్ణోగ్రతలను లెక్కించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇస్రో పంచుకుంది. జాబిల్లి ఉపరితలంపై 50.5 డిగ్రీల సెల్సియస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలుంటే.. 80 మి.మీల లోతులో మైనస్‌ 10 డిగ్రీల సెల్సియస్‌గా ఉన్నట్లు విక్రమ్ ల్యాండర్‌లోని పేలోడ్ చాస్టే గుర్తించింది. ల్యాండింగ్‌ ప్రదేశంలో ఉష్ణోగ్రతలు 20- 30 డిగ్రీల సెల్సియస్‌ వరకూ ఉండొచ్చని ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేశారు.