Leading News Portal in Telugu

School Principal: ప్రిన్సిపాల్‌ అరాచకం.. స్కూల్‌కు రాలేదని పిల్లలను చితకబాదాడు..


School Principal: చెప్పకుండా బయటకు వెళ్లడమే ఆ విద్యార్థులు చేసిన నేరం. అందుకు స్కూల్‌ ప్రిన్సిపల్​ వారిని కర్రతో వాతలొచ్చే వరకు చితకబాదాడు. ఈ ఘటన మంగళవారం జార్ఖండ్‌లోని పాలములోని సత్బర్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని భోగు గ్రామంలో జరిగింది. స్కూల్‌కు రాలేదని విద్యార్థులను క్యూలో నిలబెట్టి విచక్షణారహితంగా ప్రిన్సిపాల్ చితకబాదారు. తరగతులకు ఎందుకు హాజరు కాలేదో కారణాలు చెప్పినప్పటికీ.. యూకేజీ నుంచి 5వతరగతి వరకు విద్యార్థులను క్యూలో నిలబెట్టి పాఠశాల ప్రిన్సిపాల్ చందన్ కుమార్ శర్మ విచక్షణారహితంగా కొట్టారు.

భోగు గ్రామంలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్న పిల్లలు తమ గ్రామమైన ఖమ్దీలో పవిత్ర శ్రావణ మాసం చివరి సోమవారం నిర్వహించిన ‘కలష్ యాత్ర’కు హాజరయ్యేందుకు వెళ్లినందున వారు గైర్హాజరయ్యారు. తరగతులకు హాజరుకాకపోవడానికి గల కారణాలు చెబుతున్నప్పటికీ, ప్రిన్సిపాల్ తమను కర్రతో విచక్షణారహితంగా కొట్టారని పిల్లలు చెబుతున్నారు. ‘కలష్ యాత్ర’కు వెళ్లామని చెప్తున్నా వాతలు తేలేలా తమను చితక బాదారని ఓ పిల్లాడు చెప్పాడు. వారిని క్యూలో నిలబెట్టి కొట్టారని, తల్లిదండ్రులతో ఏమీ చెప్పవద్దని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించినట్లు విద్యార్థులు వెల్లడించారు.

అనంతరం ఇంటికి వెళ్లిన అనంతరం విద్యార్థుల శరీరంపై వాతలు చూసి కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు.. స్థానిక పోలీసులను ఆశ్రయించారు.మరోవైపు ఈ విషయమై తమకు అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఘటనపై తనకు అందిన సమాచారంపై కసరత్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. తాము పాఠశాల ప్రిన్సిపాల్‌ను పిలిచి విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని సత్బర్వా పోలీస్ స్టేషన్‌ అధికారి అమిత్ కుమార్ సోని చెప్పారు.

పిల్లలు గోలీలు ఆడుతున్నట్లు గుర్తించి ఎవరో ఒక వీడియోను ప్రిన్సిపాల్‌కు పంపినట్లు సమాచారం. విద్యార్థులు గోలీలు ఆడుతున్నట్లు వీడియో చూసిన ప్రిన్సిపాల్‌ ఆగ్రహానికి గురై విద్యార్థులను కొట్టారని పోలీసులు తెలిపారు. అయితే ప్రిన్సిపాల్ పిల్లలను కొట్టి ఉండకూడదని అన్నారు. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని.. విచారణ పూర్తయిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు.