Ghaziabad Lawyer: ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఘజయాబాద్లో న్యాయవాదిని ఇద్దరు దుండగులు పట్టపగలే కాల్చి చంపారు. న్యాయవాది కార్యాలయంలోనే ఈ హత్య జరిగింది. బుధవారం మధ్యాహ్నం జిల్లా కోర్టు కాంప్లెక్స్ లోపల ఉన్న న్యాయవాది ఛాంబర్లోకి ప్రవేశించిన గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు నేరుగా ఆయనపై కాల్పులు జరిపారు. మృతుడు నగరానికి చెందిన లాయర్ మోను చౌదరిగా గుర్తించారు. దాడి జరిగిన సమయంలో మోను చౌదరి భోజనం చేస్తున్నారు. దుండగులు కాల్పులు జరపడంతో మోను చౌదరి రక్తపు మడుగులో పడి ఉండడం కనిపించింది.
సిహాని గేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడింది. దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరించి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. అంతేకాకుండా, కోర్టు ఆవరణలో అమర్చిన సీసీటీవీ కెమెరాల నుంచి సెక్యూరిటీ ఫుటేజీని భద్రపరుస్తున్నామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సిటీ) నిపున్ అగర్వాల్ తెలిపారు. మోను చౌదరిని మధ్యాహ్నం 2 గంటలకు కాల్చి చంపినట్లు ప్రాథమిక సమాచారం. దుండగులు కాలినడకన వచ్చి నేరం చేసి పారిపోయినట్లు సమాచారం.
రాష్ట్రంలోని హాపూర్ ప్రాంతంలో న్యాయవాదులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణకు నిరసనగా పశ్చిమ యూపీ అంతటా న్యాయవాదులు ఈరోజు 24 గంటల సమ్మెకు దిగినప్పుడు ఈ హత్య జరిగింది. మరిన్ని ఘర్షణలు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున రాష్ట్రంలోని అన్ని కోర్టులు, తహసీల్ సముదాయాల వద్ద పోలీసులను మోహరించారు.అయితే, సాయుధ వ్యక్తులు ఈ భద్రతా వలయాన్ని ఛేదించి మోను చౌదరిని హత్య చేసి, ఆపై తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఏం చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. దాడి అనంతరం ఘటనాస్థలంలో అనేక మంది న్యాయవాదులు గుమిగూడారు. మోను చౌదరి సహచరులు న్యాయం కోరడంతో వెంటనే నిరసనలు చెలరేగాయి. దాడి జరిగిన సమయంలో ఇతర న్యాయవాదులు హాపూర్ సమస్యపై తమ వ్యూహాన్ని రూపొందించేందుకు సమావేశమయ్యారు.