Leading News Portal in Telugu

Mamata Banerjee: అమితాబ్ ఇంటికి వెళ్లి రాఖీ కట్టిన పశ్చిమ బెంగాల్ సీఎం మమత


Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ముంబైలోని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. ఆగస్టు 31, సెప్టెంబర్‌ 1న జరిగిన ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) కూటమి రెండు రోజుల సమావేశానికి హాజరయ్యేందుకు ముంబై విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే మమతా బెనర్జీ సబర్బన్ జుహులోని అమితాబ్‌ బచ్చన్ నివాసానికి వెళ్లారు. ఆయన కుటుంబసభ్యులతో మమత సంభాషించారు. వారి విలువైన సమయాన్ని అందించినందుకు ఆమె వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. వారి భవిష్యత్ ప్రయత్నాలన్నిటికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ రోజు తాను అమితాబ్‌కు రాఖీ కట్టినట్లు, ఈ రోజు గొప్ప రోజు అని మమతా బెనర్జీ అన్నారు. అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబ సభ్యులను కలిసిన తర్వాత విలేఖరులతో మాట్లాడిన మమతా బెనర్జీ.. కోల్‌కతాను సందర్శించాల్సిందిగా తాను నటుడిని ఆహ్వానించినట్లు చెప్పారు. తన దృష్టిలో అసలు సిసలు భారతరత్న అమితాబ్ బచ్చనేనని తేల్చి చెప్పారు. ముంబైకి వచ్చినప్పుడు తన ఇంటికి రావాలని ఆహ్వానించారని పేర్కొన్నారు. దసరా పండగ సందర్భంగా కోల్‌కతలో జరిగే దుర్గాదేవి పూజలకు హాజరు కావాలని బచ్చన్ కుటుంబాన్ని కోరినట్లు వివరించారు. ఆయన కుటుంబం కూడా చిత్ర పరిశ్రమకు పెద్దపీట వేసిందన్నారు. అమితాబ్‌ బచ్చన్ గత సంవత్సరం కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ మమతా బెనర్జీ భారతీయ సినిమాకి ఆయన చేసిన కృషికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఇండియా మన ప్రధానమంత్రి ముఖం అవుతుందన్నారు. దేశాన్ని రక్షించడమే తమ ప్రథమ కర్తవ్యం అని ఆమె అన్నారు. రక్షా బంధన్‌ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.