Himanta Biswa Sarma: రాష్ట్రవ్యాప్తంగా 1,000 వంతెనల నిర్మాణాన్ని తమ ప్రభుత్వం త్వరలో ప్రారంభిస్తుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ బుధవారం తెలిపారు. కామాఖ్య గేట్ నుంచి గౌహతిలోని మాలిగావ్ వరకు 2.6 కిలోమీటర్ల అస్లాంలో అతి పొడవైన ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన హిమంత బిస్వా శర్మ.. ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం 842 చిన్న, పెద్ద వంతెనలను పూర్తి చేసిందని అన్నారు. “మరో 1,000 వంతెనల పనులు త్వరలో చేపడతామని ప్రకటించడం సంతోషంగా ఉంది. 2026 నాటికి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయి. గౌహతి ఈశాన్య ద్వారం అని ప్రజలు చెబుతారు. అయితే మేము దీనిని ఆగ్నేయాసియాకు గేట్‌వేగా మార్చాలనుకుంటున్నాము.” అని హిమంత బిస్వా శర్మ వెల్లడించారు.
ఈ రోజు ప్రజల కోసం నీలాచల్ ఫ్లైఓవర్‌ను ప్రారంభిస్తున్నామని.. ఇది గౌహతిలో అత్యంత రద్దీగా ఉండే రహదారులలో ఒకటిగా నిర్మించబడిందని, ఇది సకాలంలో పూర్తి చేయడం పీడబ్ల్యూడీ విభాగానికి పెద్ద సవాలుగా ఉండేదని ఆయన అన్నారు. రాష్ట్ర పీడబ్ల్యూడీ శాఖ రూ.420 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపట్టింది. “దీనికి 18,000 మెట్రిక్ టన్నుల సిమెంట్, 20,000 క్యూబిక్ మెట్రిక్ టన్నుల ఇసుక, 7,500 మెట్రిక్ టన్నుల స్టీల్, ఇతర వస్తువులతో పాటు అవసరం” అని హిమంత శర్మ చెప్పారు.
ముఖ్యమంత్రి గౌహతి, అస్సాంలోని ఇతర పట్టణాలలో దాదాపు డజను రోడ్డు ప్రాజెక్టులను కూడా జాబితా చేశారు. అవి ప్రణాళిక, అమలులో వివిధ దశల్లో ఉన్నాయి. ప్రస్తుతం బ్రహ్మపుత్రపై ఫ్లైఓవర్లు, వంతెనలు వంటి 22 భారీ ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని, వీటిలో 21 పనులు చివరి దశలో ఉన్నాయని ఆయన చెప్పారు.