Leading News Portal in Telugu

Kiren Rijiju: తుక్డే-తుక్డే గ్యాంగ్ మాటలు నమ్మవద్దు.. చైనా మ్యాప్స్‌పై కేంద్ర మంత్రి


Kiren Rijiju: చైనా కొత్తగా విడుదల చేసిన మ్యాపుల్లో భారత భూభాగాలైన అక్సాయ్ చిన్, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలు ఉండటం ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలకు కారణమైంది. భారత్, చైనా తీరుపై అభ్యంతరం చెబుతోంది. ఈ వ్యవహారంలో అధికార బీజేపీని టార్గెట్ చేస్తూ.. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

అరుణాచల్ ప్రదేశ్ ను ఇలా చైనా మ్యాపుల్లో చూపడం చాలా తీవ్రమైనదిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కౌంటర్ ఇచ్చారు. భారత భూభాగాలనను రక్షించడంలో సాయుధ దళాలకు పూర్తి సామర్థ్యం ఉందని అన్నారు. ఇటీవల ఆయన అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ జిల్లాలో కమెంగ్ సెక్టార్ ని సందర్శించిన వీడియోను ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.

స్వార్థపరులు, తుక్డే తుక్డే గ్యాంగ్ సభ్యుల తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, మన భూభాగం చాలా సురక్షితంగా ఉందని, మన సాయుధబలగాలకు సరిహద్దులను రక్షించగల సామర్థ్యం ఉందని కిరణ్ రిజిజు అన్నారు. సరిహద్దుల్లో మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేయని కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తిప్పికొట్టారని, ఇప్పుడు సరిహద్దుల్లో రోడ్లు, కీలకమైన మౌళిక సదుపాయాలు నిర్మించబడ్డాయని ఆయన అన్నారు. లడఖ్‌లో భారత్‌కు చెందిన భూమిని చైనా ఇప్పటికే ఆక్రమించిందని రాహుల్‌గాంధీ చెప్పడంపై బీజేపీ నేత ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతకు ముందు ఈ వ్యవహారంపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. లడఖ్ లో ఒక్క అంగుళం భూమి కూడా పోలేదని ప్రధాని అబద్ధం చెప్పారని, చైనా ఆక్రమిస్తోందని లడఖ్ మొత్తానికి తెలుసు అని, దీనిపై ప్రధాని మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు.