Parliament Session: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సిద్ధం అవుతుందా..? ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ బిల్లును పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనుందా..? అంటే ఔననే ఊహాగానాలే వినిపిస్తున్నాయి. లోక్సభ, అన్ని రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలనే ఆలోచనలో కేంద్ర ఉందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా గురువారం రోజు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు కేంద్రం పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ రోజు వెల్లడించారు. అయితే ఈ సమావేశాల ఎజెండా ఏమిటనేది ఇప్పటి వరకు తెలియదు. జమిలీ ఎన్నికల ఆలోచనతో కేంద్ర ఉన్నట్లు తెలుస్తోంది. పలు సందర్భాల్లో జమిలీ ఎన్నికల ప్రస్తావన వచ్చింది, లా కమిషన్ కూడా దీన్ని అధ్యయనం చేసింది.
సాధారణంగా అసెంబ్లీ ఐదేళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఇలా కాకుండా అన్ని రాష్ట్రాలకు, లోక్సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ మొదటినుంచి భావిస్తోంది. ప్రస్తుతం మరికొన్ని నెలల్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, రాజస్థాన్, మిజోరాం ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి, ఆ తరువాత వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికల కోసమే కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చిందనే అంతా అనుకుంటున్నారు.