Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ ఇస్రో శాస్త్రవేత్తల్లో మరింత ఆత్మవిశ్వాసం నింపింది. ఈ విజయం ఇచ్చిన ఊపుతో మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల ఆదిత్య ఎల్ 1 పేరుతో సూర్యుడిపై అన్వేషణకు ప్రయోగాన్ని చేపడుతోంది. భవిష్యత్తులో మనకు సుదూర గ్రహాలైన అంగారకుడు, శుక్రుడిపై ప్రయోగాలను చేపడతామని ఇస్రో ఛైర్మన్ తాజాగా వెల్లడించారు. ఇదిలా ఉండగా.. చంద్రయాన్-3 మిషన్, ప్రజ్ఞాన్ రోవర్ గురించి ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకున్నారు. 14 రోజుల ముగిసేలోపు మా మిషన్ విజయవంతంగా పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆగస్టు 31 (గురువారం) అంటే ఈరోజు చంద్రయాన్-3 చంద్రుడిపై దిగిన ఎనిమిదో రోజు. చంద్రుని ఉపరితలంపై నడిచే ప్రజ్ఞాన్ రోవర్ ప్రతిరోజూ కొత్త అప్‌డేట్‌లను ఇస్తోంది. ప్రజ్ఞాన్ రోవర్ ప్రతిరోజూ దాదాపు 50 మీటర్ల దూరం ప్రయాణిస్తోంది. ప్రగ్యాన్ రోవర్ ల్యాండింగ్ అయినప్పటి నుంచి చంద్రుడి ఉపరితలంపై సమాచారాన్ని, చిత్రాలను ఇస్రోకు పంపుతూనే ఉంది. ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ చంద్రయాన్ -3 మిషన్, ప్రజ్ఞాన్ రోవర్‌కు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని పంచుకున్నారు. అంతా బాగానే ఉందని, అన్ని రకాల డేటా చాలా బాగా వస్తోందని చెప్పారు. అదే సమయంలో, 14 రోజుల ముగిసేలోపు ఈ మిషన్ విజయవంతంగా పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
చంద్రుడితోపాటు అంగారక, శుక్ర గ్రహాలపైకి వెళ్లే సత్తా భారత్‌కు ఉందని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు. ఈ అంతరిక్ష పరిశోధనలకు మరిన్ని పెట్టుబడులు అవసరమని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చీఫ్ అభిప్రాయపడ్డారు. చంద్రయాన్-3 మిషన్ విజయం తర్వాత ఇస్రో ప్రణాళికల గురించి సోమనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌కు జాబిల్లితో పాటు మార్స్, వీనస్ గ్రహాలపైకి వెళ్లి పరిశోధనలు చేసే సామర్ధ్యం ఉందని, అందుకు కావాల్సిందల్లా ఆత్మవిశ్వాసం పెంచుకోవడమేనని ఆయనపేర్కొన్నారు.