Leading News Portal in Telugu

Sonia Gandhi: ఇండియా కూటమి సమావేశానికి సోనియా, రాహుల్ గాంధీ


Sonia Gandhi: ముంబై వేదికగా ఈ రోజు, రేపు జరగబోయే ఇండియా కూటమి సమావేశానికి కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీతో పాటు ఎంపీ రాహుల్ గాంధీ ఇద్దరూ హజరుకానున్నారు. వీరు ఇప్పటికే ముంబై చేరుకున్నారు. వీరికి ఆహ్వానం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా ఎయిర్ పోర్టు ముందు గుమిగూడారు.

ప్రధాని మోడీ హవాను అడ్డుకునేందుకు, 2024 ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా చేసేందుకు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ, ఆప్, డీఎంకే, కమ్యూనిస్ట్ పార్టీలతో సహా మొత్తం 26 పార్టీలు ఇండియా పేరుతో కూటమి ఏర్పాటు చేశాయి. ఇప్పటికే ఈ కూటమికి సంబంధించి మొదటి సమావేశం పాట్నాలో జరగగా.. రెండోది బెంగళూర్ లో జరిగింది. తాజాగా మూడో సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో ముంబై వేదికగా జరుగుతున్నాయి.

శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో తాజా సమావేశం జరుగుతోంది. శరద్ పవార్, బీహార్ సీఎం నితీష్ కుమార్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, కమ్యూనిస్ట్ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ రోజు జరుగుతున్న సమావేశంలో ఇండియా కూటమి జెండా, ఎజెండాతో పాటు పలు రాష్ట్రాల్లో సీట్ల పంపకం గురించి చర్చించే అవకాశం ఉంది.