Leading News Portal in Telugu

One nation-One election: “భయపడొద్దు”.. జమిలీ ఎన్నికలపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..


One nation-One election: కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునివ్వడం పలు రకాల ఊహాగానాలకు తెరతీసింది. ముఖ్యంగా ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా మాజీ రాష్ట్రపతి నేతృత్వంలో కేంద్ర జమిలీ ఎన్నికలపై ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో ఇదే ప్రధాన ఎజెండా అవుతుందని అంతా అనుకుంటున్నారు.

ఇదిలా ఉంటే కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి జమిలీ ఎన్నిలకపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’పై ఒక కమిటీని ఏర్పాటు చేశామని, కమిటీ నివేదిక వస్తుంది, దానిపై చర్చ జరుగుతుందని అన్నారు. పార్లమెంట్ పరిపక్వమైందని, చర్చలు జరుగుతాయి, భయపడాల్సిన అవసరం లేదని, భారత్ ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిదని, పరిణామం ఉంటుందని అన్నారు. రెండు మూడు రోజుల్లో ప్రత్యేక సమావేశాల ఎజెండాను తెలియజేస్తామని తెలిపారు.

ఇదిలా ఉంటే ఢిల్లీలో జమిలీ ఎన్నికలపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. మోడీ సర్కార్ జమిలీకి సిద్ధం అవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ.. ఈ రోజు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, జమిలీ ఎన్నికల కమిటీ హెడ్ గా ఉన్న మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అంతకుముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై ప్రకటన చేశారు. సెప్టెంబర్ 18-22 మధ్య ఐదు రోజుల పాటు సమావేశాలు జరుగుతాయని ప్రకటించారు. వినాయక చతుర్థి సమయంలో సమావేశాలేంటని ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి.