Aditya-L1 Mission: చంద్రయాన్-3 విజయవంతం కావడంతో జోష్ మీదున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది.. PSLVC-57 రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది.. ఇక, ఈ ప్రయోగానికి శుక్రవారం రోజు కౌంట్‌డౌన్ ప్రారంభించింది ఇస్రో.. 24 గంటల కౌంట్‌డౌన్ ప్రక్రియ అనంతరం ఈ రోజు ఉదయం 11 గంటల 50 నిమిషాలకు రాకెట్‌ను ప్రయోగించనున్నారు శాస్త్రవేత్తలు.. PSLVC-57 రాకెట్ ద్వారా సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య-L1 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది ఇస్రో.. నిన్న మొదలైన కౌంట్‌డౌన్ సవ్యంగా సాగుతోందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ప్రయోగ ప్రక్రియపై శాస్త్రవేత్తలతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్.
ఇక, రాకెట్ లో ఇంధనం నింపుతున్నారు శాస్త్రవేత్తలు.. శ్రీహరికోటలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు.. రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు తరలివస్తుండడంతో.. దానికి అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.. ఇప్పటికే తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) వేదిక సిద్ధం అయ్యింది.. సూర్యుడి వాతావరణాన్ని వడపోసి, అక్కడి రహస్యాలను తెలుసుకునేందుకు ఈ రోజు ఉదయం 11.50 గంటలకు ఆదిత్య-ఎల్1 ఉపగ్రహంతో పీఎస్‌ఎల్‌వీ-సీ57 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం 4 నెలలపాటు ప్రయాణించి భూమి నుంచి సూర్యుడి దిశగా ఉన్న ‘ఎల్1’ పాయింట్‌ను చేరుకుటుంది.. ఇది భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరం.. ఇంత సుధూర ప్రదేశంలోకి ఇస్రో ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇదే తొలిసారి కావడంతో ఉత్కంఠగా మారింది..
‘ఎల్1’ పాయింట్ నుంచి సూర్యుడిపై ప్రయోగాలు చేపనట్టనున్నారు శాస్త్రవేత్తలు.. ఎల్1 ప్రదేశం నుంచి ఎలాంటి అవరోధాల్లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసే వీలుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నమాట.. ఇక, ఆదిత్య-ఎల్1లో 7 పరిశోధన పరికరాలను పొందుపర్చారు శాస్త్రవేత్తలు.. ఇవి సూర్యుడి పొరలైన ఫొటో స్పియర్, క్రోమో స్పియర్ సహా వెలుపల ఉండే కరోనా లాంటి వాటిపై అధ్యయనం చేయనున్నాయి. మరోవైపు.. సూళ్లూరుపేటలోని చెంగాళ్ల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇస్రో ఛైర్మన్ డా.సోమనాథ్.. నిర్దేశించిన సమయానికే ప్రయోగం చేపడతాం. చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్లు బాగా పని చేస్తున్నాయి. 14 రోజులు ముగిసేలోపు తమ లక్ష్యం పూర్తవుతుందని ఆశిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.. ఇక, ‘ఆదిత్య-ఎల్1’ నమూనాతో తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇస్రో శాస్త్రవేత్తలు.