Karnataka: కర్ణాటక రాష్ట్రానికి సొంత విమానయాన సంస్థను ఏర్పాటు చేసుకునే దిశగా ఆలోచిస్తోంది. స్థానికంగా కనెక్టివిటీ పెంచేందుకు సొంతంగా విమానయాన సంస్థలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలస్తున్నట్లు కర్ణాటక పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ మంత్రి ఎంబీ పాటిల్ శనివారం అన్నారు.
మేము మా సొంత విమానాశ్రయాలను నిర్వహించడం ప్రారంభించిన తర్వాత.. సొంత విమానయాన సంస్థను కలిగి ఉంటామని ఆయన అన్నారు. మూడు విమానాలను కొనుగోలు చేయవచ్చని ఆయన తెలిపారు. మైసూర్-బెంగళూరు, బెంగళూరు-హుబ్లీ వంటి ఇంటర్సిటీ ప్రయాణాలకు వాటిని ఉపయోగించవచ్చని వెల్లడించారు. దీని ఖర్చు రూ. 1600 కోట్లు ఎంబీ పాటిల్ తెలిపారు. ఈ ప్రణాళిక లాభనష్టాలను పరిశీలించామని ఆయన అన్నారు. కర్ణాటకలో కొత్తగా నిర్మించిన శివమొగ్గ విమానాశ్రయంలో గురువారం తొలివిమానం ల్యాండైన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బెంగళూర్ నుంచి శివమొగ్గ వచ్చిన ఇండిగో విమానంలో మాజీ ముఖ్యమంత్రి ఎడియూరప్ప కూడా ఉన్నారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఫస్ట్ ఏయిర్ పోర్టు ఇదే. మల్నాడు, మధ్య కర్ణాటక జిల్లాలకు శివమొగ్గ విమానాశ్రయం చాలా కీలకమైందని పాటిల్ అన్నారు. చిక్కమగళూర్, దావణగెరె, చిత్రదుర్గ, హవేరి జిల్లాల ప్రజలుకు ప్రయోజనకరంగా ఉంటుందని, బెంగళూర్, హైదరాబాద్, తిరుపతి, చెన్నై, గోవా వంటి ప్రాంతాలకు నేరుగా విమాన సేవల్ని అందించడంపై దృష్టి పెడుతున్నట్లు తెలిపారు.