Leading News Portal in Telugu

West Bengal: బెంగాల్‌లో కస్టడీలో ఉన్న ఖైదీ మృతి.. బంధువులు ఆందోళన


జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న 25 ఏళ్ల వ్యక్తి శనివారం ఆసుపత్రిలో మరణించాడు. దీంతో పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లా పంచ్లా ప్రాంతంలో మృతుడి బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు. తనను చిత్రహింసలకు గురిచేయడం వల్లే మరణించాడని ఆరోపిస్తూ రహదారిని దిగ్బంధించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని చెదరగొట్టి.. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: ఆరేళ్ల క్రితం మైనర్ బాలికను అపహరించిన కేసులో సోమనాథ్ సర్దార్‌ను ఆగస్టు 29న అతని ఇంట్లో అరెస్టు చేశారు. అయితే బాలిక కుటుంబీకులు ఫిర్యాదు చేయడంతో అతడు ఆ ప్రాంతం నుంచి పరారీ కాగా.. ఆ తర్వాత నిందితుడు ఇంటికి వచ్చినట్లు తెలుసుకుని పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అనంతరం అతన్ని బుధవారం కోర్టులో హాజరుపరచగా.. అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అయితే జైలులో ఉంచిన తర్వాత.. అతను శుక్రవారం అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అక్కడి నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా.. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మరణించాడు.

అయితే నిందితుడు మరణ వార్త అతని గ్రామ ప్రజలకు తెలియడంతో వారు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అతని మరణానికి కస్టడీలో చిత్రహింసలే కారణమని మృతుడి కుటుంబ సభ్యులు, స్థానికులు పంచల ప్రాంతంలో రోడ్డు దిగ్బంధనం చేశారు. ఆ తర్వాత పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.