బాలాసోర్ రైలు ప్రమాద ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు అధికారులు అరెస్ట్ అయ్యారు. వారిపై ఐపీసీ 304, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు వారు సాక్ష్యాలను తారుమారు చేసేందుకు కూడా ప్రయత్నించారంటూ చార్జిషీటులో పేర్కొంది. సీనియర్ ఇంజినీర్ అరుణ్ కుమార్ మహంతా, సెక్షన్ ఇంజినీర్ మహమ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్లపై హత్య, సాక్ష్యాలు ధ్వంసం వంటి నేరపూరిత అభియోగాలు మోపింది.
దేశ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన సంఘటనగా నిలుస్తూ బాలాసోర్ రైల్వే ప్రమాదంలో 290 మంది మరణానికి కారణమైంది. వేలాది మంది గాయపడ్డారు. కాళ్లు, చేతులు కోల్పోయిన వందలాది మంది వికలాంగులుగా మారారు. మరోవైపు ఈ మూడు రైళ్ల ప్రమాదం వెనుక విద్రోహ చర్య ఉండవచ్చని రైల్వే శాఖ అనుమానించింది. ఈ నేపథ్యంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సీబీఐ దర్యాప్తు కోరారు. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు మూడు రైళ్ల ప్రమాదంపై దర్యాప్తు జరిపారు. మానవ తప్పిదమే ప్రధాన కారణమని తేల్చారు.
బహనగా స్టేషన్ సమీపంలోని గేటు నెంబర్ 94 లెవెల్ క్రాసింగ్ వద్ద మరమ్మతు పనులను ఎల్సి గేట్ నంబర్ 79 సర్క్యూట్ రేఖాచిత్రాన్ని ఉపయోగించి మహంత చేసినట్లు సీబీఐ ఆరోపించింది. కానీ మహంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ టెస్టింగ్ నిర్వహించలేదని, ఇంటర్లాకింగ్ ఇన్స్టాలేషన్ కూడా ప్రణాళికాబద్ధంగా లేవని.. ఈ కారణాల వల్లనే మూడు రైళ్లు ఢీకొన్నాయని సీబీఐ చార్జిషీటులో పేర్కొంది.