Early Elections: కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునివ్వడంతో ఒక్కసారి జమిలి ఎన్నికలు, ముందస్తు ఎన్నికలపై చర్చ జోరందుకుంది. ముఖ్యంగా విపక్షాలు ఇండియా కూటమిలోని పార్టీలు కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని అంచనా వేస్తున్నాయి. సీఎంలు నితీష్ కుమార్, మమతా బెనర్జీ వంటి వారు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయితే వీటిపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు సార్వత్రిక ఎన్నికలు వెళ్లే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ పూర్తి పదవీకాలం వరకు దేశ పౌరులకు సేవ చేయాలని కోరుకుంటున్నారని అన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలను మీడియా ఊహాగానాలుగా కొట్టిపారేశారు.
‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’పై కమిటీ ఏర్పాటు చేసిందని, ఎన్నికల నిబంధనలు ఖరారు చేసే ముందు కమిటీ అందరితో విస్తృతమైన చర్చలు జరుపుతుందని అనురాగ్ ఠాకూర్ అన్నారు. కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ఈ కమిటీలో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం కోరుతుందని మంత్రి చెప్పారు. సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని, అయితే ప్రత్యేక సమావేశాల ఎజెండాను మాత్రం వెల్లడించలేదని కేంద్రమంత్రి అన్నారు. ఎజెండాను పార్లమెంట్ వ్యవహారాల మంత్రి తగిన సమయంలో వెల్లడిస్తారని ఆయన అన్నారు.