Leading News Portal in Telugu

Amit Shah: ఇండియా కూటమి హిందూమతాన్ని ద్వేషిస్తోంది.. సీఎం కొడుకు వ్యాఖ్యలపై ఫైర్..


Amit Shah: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొడుకు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ నాయకులు తమిళనాడుతో మొదలు దేశంలోని నాయకులు డీఎంకే, స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శిస్తున్నారు.

ఇదిలా ఉంటే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష ఇండియా కూటమి హిందూ మతాన్ని ద్వేషిస్తోందని, అది మన వారసత్వంపై దాడి చేస్తోందని అమిత్ షా అన్నారు. రాజస్థాన్ లోని దుంగార్ పూర్ బీజేపీ పరివర్తన యాత్రను ప్రారంభించిన సందర్భంగా షా మాట్లాడుతూ.. త్వరలో రాజస్థాన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు.

సనాతన ధర్మపై ఉదయనిధి వ్యాఖ్యలు ఇండియా కూటమి ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలగా ఆయన అభివర్ణించారు. 2010లో రాహుల్ గాంధీ లష్కరేతోయిబా కన్నా హిందూ రాడికల్ సంస్థలు పెద్ద ముప్పు అన్న వ్యాఖ్యలను అమిత్ షా ప్రస్తావించారు. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతున్న సమయంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

చెన్నైలో జరిగిన రచయితల సదస్సులో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమని, దానిని నిర్మూలించాలని, సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో బీజేపీ నాయకులు డీఎంకే పార్టీ, ఉదయనిధి స్టాలిన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు.

రాజస్థాన్ ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ.. సనాతన ధర్మం ప్రజల హృదయాలను శాసిస్తోందని అన్నారు. రాముడి జన్మస్థలంలో జనవరిలో రామమందిరం సిద్ధమవుతోందని, ఇండియా కూటమి దీన్ని అడ్డుకోలేదని, కాంగ్రెస్ ఏళ్ల తరబడి రామమందిరాన్ని అడ్డుకుందని అమిత్ షా అన్నారు.