Leading News Portal in Telugu

Udhampur Leopard: నాలుగేళ్ల పాపను ఇంటినుంచి ఎత్తుకెళ్లిన చిరుత.. రెండు కిలో మీటర్ల దూరంలో..


Udhampur Leopard: జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో నాలుగేళ్ల పాపను చిరుతపులి ఆమె ఇంటి నుంచి ఎత్తుకెళ్లింది. ఆ తర్వాత తన ఛిద్రమైన మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన శనివారం సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య జరిగింది. ఘటనపై ఉదంపూర్ కంట్రోల్ రూంకు సమాచారం అందిన వెంటనే ఒక బృందాన్ని సిద్ధం చేసి సంఘటనా స్థలానికి పంపించారు. దీని తర్వాత బృందం పాప కోసం వెతకడం ప్రారంభించింది. ఉధంపూర్‌లోని జమ్మూ కాశ్మీర్ వన్యప్రాణి విభాగం రేంజ్ ఆఫీసర్ రాకేష్ శర్మ మాట్లాడుతూ.. ‘రాత్రి 7-8 గంటల సమయంలో చిరుతపులి ఒక బాలికను తీసుకెళ్లింది. మాకు సమాచారం అందిన వెంటనే ఉదంపూర్ కంట్రోల్ రూం నుంచి బృందాన్ని పంపించాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదనే ఇక్కడికి వచ్చామన్నారు.

ఇది చాలా దురదృష్టకర సంఘటనగా ఆయన అభివర్ణించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. అవగాహన ప్రచారంలో భాగంగా, పిల్లలు, మహిళలు, వృద్ధులను తెల్లవారుజామున, సాయంత్రం ఒంటరిగా వెళ్లనివ్వవద్దని ప్రజలను కోరారు. అనంతరం స్థానికులు ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. దూరంగా చిధ్రమైన స్థితిలో బాలిక మృతదేహం కనిపించింది. ఉదంపూర్‌లోని పంచ్రీ తహసీల్ ఎగువ గ్రామం బంజ్లా గ్రామంలో ఈ ఘటన జరిగింది.

చిరుతపులిని పట్టుకోవడానికి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని ఆయన తెలిపారు. త్వరలోనే ఎలాగైనా చిరుత పులిని పట్టుకుంటామన్నారు. బాధిత కుటుంబానికి పరిహారం అందేలా చూస్తామన్నారు. వారికి వీలైనంత త్వరగా పరిహారం అందజేస్తామన్నారు. దీంతో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా తెల్లవారుజామున, చీకటి పడిన తర్వాత వన్యప్రాణులు ఈ సమయంలో చాలా చురుగ్గా ఉంటాయని తెలిపారు. ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటామన్నారు.