Leading News Portal in Telugu

Manipur Violence: ఎడిటర్స్ గిల్డ్ సభ్యులపై ఎఫ్ఐఆర్.. అల్లర్లను పెంచేందుకు యత్నించారని ఆరోపణ


Manipur Violence: కొన్ని నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణ జరగుతోంది. అయితే అక్కడి ఇప్పుడిప్పుడే శాంతియుత వాతావరణం ఏర్పడింది. ఇదిలా ఉంటే ఇటీవల కొన్ని రోజుల నుంచి కొన్ని ప్రాంతాల్లో మళ్లీ హింస చెలరేగింది. ఇదిలా ఉంటే ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సభ్యులపై మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. చైర్మన్, దాని ముగ్గురు సభ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ వెల్లడించారు. మణిపూర్ లో మరిన్ని ఘర్షణలను సృష్టించడానికి ప్రయత్నించారని సీఎం ఆరోపించారు.

జాతి హింసై మీడియా నివేదికలు ఏకపక్షంగా ఉన్నాయని ఇటీవల ఎడిటర్స్ గిల్డ్ ఆరోపించింది. రాష్ట్ర నాయకత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది. ఈ ఆరోపణలపై రాష్ట్రప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రంలో మరింత హింసను ప్రేరేపించేలా ప్రయత్నిస్తున్నారంటూ వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీఎం తెలిపారు. కేసు బుక్ అయిన వారిలో ఎడిటర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ సీమా ముస్తాఫా, సీమా గుహ, భరత్ భూషణ్, సంజయ్ కపూర్ ఉన్నారు. మణిపూర్ రాష్ట్రంలో హింసకు సంబంధించి మీడియా నివేదికను అధ్యయనం చేసేందుకు సీమా గుహ, భరత్ భూషణ్, సంజయ్ కపూర్ గత నెలలో రాష్ట్రాన్ని సందర్శించారు. ఈ విషయంపై నిర్థారణకు వచ్చే ముందు అన్ని వర్గాల ప్రజలను కలుసుకుని ఉండాల్సిందని.. కొన్ని విభాగాలను కాదని ముఖ్యమంత్రి అన్నారు.

గత నాలుగు నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. మైయిటీ, కుకీ తెగల మధ్య రక్తపాతం జరిగింది. ఇరు వర్గాలు గ్రామాలను కాల్చివేసుకున్నాయి, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణల్లో వందల్లో ప్రాణాలు కోల్పోయారు. మైయిటీ వర్గం తమకు కూడా ఎస్టీ హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడం, దీన్ని కుకీలు వ్యతిరేకించడంతో ఘర్షణలు మొదలయ్యాయి. చూర్‌చాంద్ పూర్, బిష్ణుపూర్, కాంగ్ పోక్సీ జిల్లాల్లో హింస ఎక్కువగా చెలరేగింది.