Leading News Portal in Telugu

Corona Vaccine: కరోనా టీకాకు, గుండెపోటు ముప్పుకు సంబంధం ఉందా?


Corona Vaccine: దేశంలో కరోనా మహమ్మారి విజృంభించిన తర్వాత గుండెపోటు కేసులు గణనీయంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో కరోనా టీకా ప్రభావం గుండెపోటు కేసులు పెరగడానికి ఏమైనా కారణమా అనే అనుమానాలు కూడా చాలా పెరిగిపోయాయి. ఒకప్పుడు వయస్సు పైబడిన వాళ్లు మాత్రమే సాధారణంగా గుండె జబ్బు బారిన పడేవారు. కరోనా విజృంభణ తర్వాత యువకులు కూడా చాలా మంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే కరోనా టీకా కారణంగానే గుండెపోటు ముప్పు పెరిగిందనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. జనాలు కూడా యువకులకు గుండెపోటు రావడానికి కారణం ఈ కరోనా వ్యాక్సినేనని నమ్మడం మొదలు పెట్టారు. దీంతో ఈ కోణంలో కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో పరిశోధనలు చేస్తోంది. ఇదే సమయంలో భారత్‌లో వినియోగించిన కరోనా వ్యాక్సిన్లకు, గుండెపోటు ముప్పు పెరుగుదలకు ఎటువంటి సంబంధం లేదని తాజా రీసెర్స్ వెల్లడించింది. మన దేశంలో కరోనా వ్యాక్సిన్‌లు సురక్షితమైనవేనని పరిశీలన అధ్యయనం తెలిపింది. ఇందుకు సంబంధించిన నివేదిక.. పీఎల్‌ఓఎస్‌ వన్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

భారత్‌లోని కరోనా టీకాలు సురక్షితమని తమ అధ్యయనంలో తెలిసిందని రీసెర్చ్‌కు నేతృత్వం వహించిన జీబీ పంత్ ఆస్పత్రికి చెందిన మోహిత్ గుప్తా వెల్లడించారు. భారత్‌లో గుండెపోటుకు వ్యాక్సిన్‌లతో సంబంధం లేదని ఆయన తెలిపారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో గుండెపోటు మరణాలు తక్కువగా ఉన్నాయని ఈ అధ్యయనంలో గుర్తించామని మోహిత్ గుప్తా స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత అక్యూట్‌ మయోకార్డియల్‌ ఇన్‌ఫార్‌క్షన్‌ ఎప్పుడూ కనిపించలేదని తమ విశ్లేషణలో తేలినట్లు చెప్పారు. వయసు, మధుమేహం, ధూమపానం కారణాల వల్లే మరణం ముప్పు ఎక్కువగా కనిపించిందని తెలిపారు. ఇది ఒకే కేంద్రంలో జరిపిన అధ్యయనమని, ఇందుకు కొన్ని పరిమితులు ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు.

రోగుల ప్రాణాలను కాపాడడంతో వ్యాక్సిన్‌ కీలక పాత్ర పోషించిందని పరిశోధకులు పేర్కొన్నారు. రోగం తీవ్రంగా ఉన్నవారిలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ను అందించడం వల్ల కరోనా నుంచి రక్షించబడ్డారని చెప్పారు. దీంతో మరణాల రేటు తగ్గిందన్నారు. కరోనా టీకా వల్ల ఏ పేషెంట్‌కు కూడా గుండెపోటు రాలేదని.. కరోనా టీకా తీసుకున్న 30 రోజుల్లో 2 శాతం మంది రోగులు మాత్రమే మరణించారని అన్నారు. ఆ మరణాలు కూడా వ్యాక్సిన్ వల్ల సంభవించలేదన్నారు. వైరస్ సోకిన రోగులలో మరణాల రేటును తగ్గించడంలో కరోనా టీతా చాలా సహాయపడిందని పరిశోధకులు తెలిపారు.

ఢిల్లీలోని జీబీ పంత్‌ ఆస్పత్రిలో ఈ అధ్యయనం జరిగింది. గుండెపోటు తర్వాత బాధితుల మరణానికి సంబంధించి వ్యాక్సిన్‌ ప్రభావం ఏమైనా ఉందా..? అనే విషయంపై పరిశోధకులు ఈ అధ్యయనాన్ని జరిపారు. ఇందు కోసంఆగస్టు 2021-ఆగస్టు 22 మధ్య కాలంలో చేరిన 1578 మంది రోగుల సమాచారాన్ని విశ్లేషించారు. వీరిలో 1086 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నవారు కాగా.. 492 మంది టీకా తీసుకోలేదు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో 1047 (96 శాతం) మంది రెండు డోసులు తీసుకోగా.. మరో 4శాతం మాత్రం కేవలం ఒక డోసు తీసుకున్నారు. కరోనా టీకాలు తీసుకున్న వారిలో చాలా శాతం మంది కరోనా నుంచి రక్షించబడ్డారు.