కేరళలోని కొట్టాయం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన తండ్రి మృగంగా మారాడు. మానసిక ఒత్తిడితో మొదట తన ముగ్గురు కూతుళ్లను గొంతు కోసి చంపాలని ప్రయత్నించి, ఆ తర్వాత తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు మద్యానికి బానిసయ్యాడని, ఏడాది క్రితమే భార్య వదిలి వెళ్లిపోయిందని పోలీసులు చెబుతున్నారు. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురై మానసిక ఒత్తిడికి గురైనట్లు పేర్కొన్నారు.
ఈ సంఘటన రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. తల్లి లేని ముగ్గురు కూతుళ్లకు తండ్రి ఆసరాగా నిలిచాడు. అయితే అర్థరాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన నిందితుడు.. తీవ్ర మనస్తాపంతో ముగ్గురు కుమార్తెల గొంతు కోసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. కూతుళ్లను ఒకరి తర్వాత ఒకరిని చంపేందుకు ప్రయత్నించాడని పోలీసులు చెబుతున్నారు. కుమార్తెలు ముగ్గురు 15 ఏళ్లలోపు వారే ఉన్నారు.
నిందితుడు మొదట చిన్న కూతురిని చంపేందుకు ప్రయత్నించాడని, తనను చంపే సమయంలో ఇద్దరు కుమార్తెలు బయటకు పరుగెత్తారని, అయితే తండ్రి వారిని వెంబడించి పట్టుకుని ఇద్దరి గొంతులు కోసి హత్యకు ప్రయత్నించాడని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం చిన్న కూతురు పరిస్థితి విషమంగా ఉందని.. మిగిలిన ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు మద్యానికి బానిసయ్యాడని.. అందుకే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు. ఏడాది క్రితమే అతని భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడంతో అప్పటి నుంచి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడని తెలిపారు.