Bengal Minister: పశ్చమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ జేమ్స్ బాండ్లా వ్యవహరిస్తున్నారని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బ్రత్యా బసు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రెసిడెన్సీ యూనివర్శిటీ సహా ఏడు యూనివర్సిటీలకు తాత్కాలిక ఉపకులపతులను నియమించాలని బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తీసుకున్న చర్య నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బ్రత్యా బసు గవర్నర్‌ను “జేమ్స్ బాండ్”తో పోల్చారు. గతంలో బెంగాల్ గవర్నర్‌గా పనిచేసిన ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ ఈ విధంగా వ్యవహరించిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఛాన్సలర్ హోదాలో గవర్నర్ ఆదివారం ఏడు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించారు. ప్రెసిడెన్సీ యూనివర్సిటీతో పాటు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ బుర్ద్వాన్, నేతాజీ సుభాస్ ఓపెన్ యూనివర్శిటీ, వెస్ట్ బెంగాల్ యూనివర్శిటీ ఆఫ్ యానిమల్ అండ్ ఫిషరీ సైన్సెస్ ఉన్నాయి.
అప్పటి గవర్నర్, ప్రస్తుత ఉపరాష్ట్రపతి అయిన జగదీప్ ధన్కర్ గురించి అనుకూలంగా మాట్లాడారు. ‘‘అంతకు ముందు పని చేసిన గవర్నర్ కనీసం ఫైళ్లను కదిలించేవారు. నేను ఫైల్ పంపితే ఆయన తిరిగి ఓ నోట్ పంపేవారు, దానికి బదులు మళ్లీ నోట్ పంపించేవాళ్లం. మేం ఒప్పుకోకపోతే వాదించాం. సీనియర్ లాయర్ కావడంతో ఆయనకు చట్టం తెలుసు. .. చర్చలు, సంభాషణలు, ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచేవి. కానీ ప్రస్తుత గవర్నర్‌లాగా ఏకపాత్రాభినయం నాడు లేదు.’ అని బ్రత్యా బసు ఈ రోజు చెప్పారు. ఆనాటి గవర్నర్ జగదీప్ ధన్కర్ ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను తేలిగ్గా తీసుకోలేదని ఆయన గుర్తు చేశారు. జగదీప్ ధంఖర్‌తో మాట్లాడిన ప్రతిసారీ, అతను టేబుల్ వద్ద కూర్చుని విషయాలు చర్చించాలని కోరుకున్నాడన్నారు. దాంతో చట్టం గురించి ముఖాముఖి వాదనలు జరిగేవన్నారు. ఆయన ఈ జేమ్స్‌బాండ్‌లా సైలెంట్ ఆపరేటర్ కాదని చెప్పారు. గవర్నర్ సీవీ ఆనందబోస్ ఏకపక్షంగా వ్యవహరించి తాత్కాలిక ఛాన్స్లర్లను నియమించడంతో ముఖ్యమంత్రి స్థాయి నుంచి విమర్శలు మొదలయ్యాయి.
సుదీర్ఘమైన మాటల యుద్ధం నేపథ్యంలో ఈ నియామకాలు జరిగాయి. ఎటువంటి విద్యా నేపథ్యం లేని వారిని ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టారన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గవర్నర్ నియామకాలపై ఘాటుగా విమర్శించారు. ప్రొఫెసర్ రాజ్ కుమార్ కొఠారి పశ్చిమ బెంగాల్ స్టేట్ యూనివర్శిటీకి తాత్కాలిక వీసీగా నియమితులయ్యారు. ప్రస్తుతం రవీంద్రభారతి యూనివర్సిటీకి తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తున్న జస్టిస్ సుభ్రకమల్ ముఖర్జీ ప్రెసిడెన్సీ యూనివర్శిటీకి తాత్కాలిక వైస్-ఛాన్సలర్‌గా కూడా ఉంటారు. యూనివర్సిటీ చట్టాల ప్రకారం వైస్ ఛాన్సలర్లకు అకడమిక్ నేపథ్యం ఉండాల్సిన అవసరం లేదని గవర్నర్ కార్యాలయం వాదించింది.