Sanatana Dharma Controversy: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని చెబుతూ.. మలేరియా, డెంగ్యూలతో పోల్చడంపై హిందూ సంఘాలు, ముఖ్యంగా బీజేపీ పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. డీఎంకే పార్టీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమిలో డీఎంకే పార్టీ సభ్యుడిగా ఉండటంతో ఆ కూటమి వైఖరిని చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇండియా కూటమి హిందూ మతానికి వ్యతిరేకంగా ఉందని విమర్శిస్తోంది.
ఇదిలా ఉంటే ఆయోధ్యకు ఆలయానికి చెందిన ప్రధాన పూజారి పరంధాస్ ఆచార్య, ఉదయనిధి స్టాలిన్ నరికిన వారికి రూ.10 కోట్లను ప్రకటించిడం మరో వివాదానికి కారణమైంది. రూ. 10 కోట్ల రివార్డు ప్రకటిస్తూ ఆయన మంగళవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా.. ఈ రివార్డు సరిపోకపోతే, నేను రివార్డును పెంచుతానని అన్నారు. సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదని పరంధాస్ అన్నారు.
సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దేశంలోని 100 కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని, ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే తన వ్యాఖ్యలు బీజేపీ వక్రీకరిస్తోందని, హిందూ సమాజాన్ని తాను లక్ష్యం చేసుకోలేదని ఉదయనిధి అన్నారు. మరోవైపు సాధువు చేసిన వ్యాఖ్యలపై కూడా సెటైర్లు వేశారు. తన తల దువ్వేందుకు రూ. 10 కోట్లు ఎందుకని.. రూ.10 దువ్వెన ఉంటే చాలని ఉదయనిధి అన్నారు.