Leading News Portal in Telugu

Uttar Pradesh: పెళ్లి కావడం లేదని శివలింగాన్ని దొంగలించిన ఓ వ్యక్తి


Uttar Pradesh: పెళ్లి కావడం లేదని రోజు పూజించే శివలింగాన్ని మాయం చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన యూపీలోని కౌశాంబి జిల్లాలో వెలుగు చూసింది. మహేవాఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్హియావాన్ మార్కెట్‌లో నివాసం ఉంటున్న 27 ఏళ్ల చోటు.. శ్రావణ మాసం మొత్తం శివుడికి ప్రత్యేక పూజలు చేశాడు. అయితే తన పెళ్లి జరగాలని రోజు ప్రార్థించేవాడు. అయితే శ్రావణం అయిపోయింది. తన కోరిక నెరవేరలేదు. దీంతో మనస్తాపానికి గురైన చోటు శివలింగాన్ని మాయం చేశాడు.

అయితే ఉదయాన్ని ఆలయానికి వచ్చిన కొందరు భక్తులు.. శివలింగం కనపడకపోవడంతో షాక్‌కు గురయ్యారు. దీంతో ఆలయ పూజారి వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా దర్యాప్తు ప్రారంభించారు. అయితే శివలింగాన్ని దొంగిలించడంలో చోటు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే శివలింగాన్ని దొంగిలించి ఆలయంలో ఒకచోట దాచినట్లు తెలిపాడు.

దీంతో పోలీసులు శివలింగాన్ని గుర్తించి.. తిరిగి మళ్లీ ఆలయంలో ప్రతిష్టించారు. మరోవైపు నిందితుడు చోటూపై ఐపీసీ సెక్షన్ 379, 411 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు పోలీసులు. ఈ ఘటనపై ఎస్పీ బ్రిజేష్ స్పందిస్తూ.. చోటూ అనే యువకుడు మహేవాఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్హియావా గ్రామ నివాసి అని తెలిపారు. ఛోటూ శ్రావణ మాసంలో ప్రతిరోజూ గుడికి వెళ్లేవాడని.., అక్కడ ప్రార్థనలు చేసేవాడన్నారు. అతను తన పెళ్లికి సంబంధించి ఒక ప్రమాణం చేశాడని, ఆ ప్రతిజ్ఞ నెరవేరలేదని తెలిసింది. దీంతో శివలింగాన్ని దొంగలించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.