Leading News Portal in Telugu

Meeting: సోనియా నివాసంలో కీలక భేటీ.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై చర్చ


కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నివాసంలో కీలక భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొన్నారు. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్‌లోని సభ్యులకు సోనియా గాంధీ దిశానిర్దేశం చేస్తున్నారు. అంతేకాకుండా.. భారత్‌గా పేరు మార్పు, ఒక దేశం ఒకే ఎన్నిక, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై చర్చిస్తున్నారు. మరోవైపు ఈ సమావేశం పూర్తికాగానే ఇండియా కూటమిలోని పార్టీల ఫ్లోర్ లీడర్లతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే భేటీ కానున్నారు.

మరోవైపు ఈ నెల 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. ఈ సమావేశాల్లోనే ఇండియా పేరు మార్చే ప్రతిపాదనలు తీసుకురానున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నేతలు ఎమర్జెన్సీ మీటింగ్ లు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, విపక్ష సభ్యులు కూటమి పేరు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.