Rishi Sunak: బ్రిటన్, ఇండియాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ త్వరగా ముగించాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. యూకే ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదురుతుందని అనుకున్నారు, గతేడాది దీపావళి ముందే రెండు దేశాల మధ్య ఒప్పందం కుదురుతుందని అనుకున్నప్పటికీ సాధ్యపడలేదు. ప్రధాని మోడీపై బీబీసీ గుజరాత్ అల్లరను ఉద్దేశించి డాక్యుమెంటరీని ప్రసారం చేయడం, పలు కారణాలు ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందాన్ని ప్రభావితం చేశాయి.
ఇదిలా ఉంటే న్యూఢిల్లీలో సెప్టెంబర్ 9-10 తేదీల్లో జరిగే జీ20 సమావేశాలకు రిషి సునాక్ హాజరవుతున్న నేపథ్యంలో మరోసారి ఈ ఒప్పందం వార్తల్లోకి వచ్చింది. మంగళవారం రిషి సునాక్ తన మంత్రులతో మాట్లాడుతూ బ్రిటన్ మొత్తానికి ప్రయోజనం చేకూర్చినప్పుడు మాత్రమే భారత్ తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని అన్నారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం చర్యలు పురోగతిలో ఉన్నాయని, మొత్తం యూకే కోసం పనిచేసే విధానానికి మాత్రమే రిషి సునాక్ అంగీకరిస్తారని ఆయన ప్రతినిధి మీడియాలో చెప్పారు.
భారతదేశం పెద్ద ఎగుమతిదారుగా మారే లక్ష్యంతో బ్రిటన్ తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని చూస్తోంది. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాణిజ్య అవకాశాలను విస్తరించాలని యూకే ఆసక్తిగా ఉంది. యూకే విస్కీ, ప్రీమియం కార్లను అమ్ముకునేందుకు పెద్ద మార్కెట్ కోసం వెతుకుతోంది. గత నెలలో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరి నాటికి బ్రిటన్ లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్యలు ముగించాలని భారత్ భావిస్తోందని అన్నారు. యూకేలో ఫ్రీ ట్రేడ్ ఒప్పందం దగ్గర ఉందని ఆమె అన్నారు.