Parliament Special Session: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ లేఖపై ప్రభుత్వం స్పందించింది. కాంగ్రెస్ సంప్రదాయాలను పట్టించుకోకపోవడం దురదృష్టకరమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అజెండాను ప్రకటించకుండ పార్లమెంట్ ను ప్రత్యేకంగా ప్రభుత్వం సమావేశపరుస్తోందని సోనియాగాంధీ అన్నారు.
ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు పనితీరును రాజకీయం చేయడం, వివాదాలు లేని చోట అనవసర వివాదాలు సృష్టించడం అత్యంత దురదృష్టకరమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాలు 85వ అధికరణం ప్రకారం రాజ్యాంగ ఆదేశానికి అనుగుణంగా క్రమం తప్పకుండా జరుగుతాయని తెలిపారు.
ఎలాంటి సమస్యనైనా చర్చించేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పడూ సిద్ధంగా ఉందని ప్రహ్లాద్ జోషి అన్నారు. ఎప్పటిలాగే సెషన్ యొక్క ఎజెండా ఏర్పాటు తగిన సమయంలో ప్రసారం చేస్తామని తెలిపారు. పార్లమెంట్ గౌరవాన్ని కాపాడుతామని, రాజకీయ వివాదాలకు ఈ వేదికను ఉపయోగించబోమన్నారు. రాబోయే సెషన్‌ను సజావుగా నిర్వహించడంలో మీ పూర్తి సహకారాన్ని ఆశిస్తున్నట్లు ప్రహ్లాద్ జోషి పేర్కొ్న్నారు.
ఇదిలా ఉంటే.. ఉదయం ప్రధాని మోడీకి సోనియాగాంధీ ఏం లేఖ రాసారంటే.. పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి అజెండాను లిస్ట్ చేయలేదన్నారు. అందులో మణిపూర్, ధరల పెరుగుదల సహా తొమ్మిది విషయాలు చేర్చాలని ఆమె లేఖలో పేర్కొన్నారు.