Leading News Portal in Telugu

PM Modi Tour: ఇండోనేషియా పర్యటన.. ఆసియన్ సదస్సులో పాల్గొననున్న మోడీ


PM Modi Tour: ప్రధాని మోడీ బుధవారం ఇండోనేషియా పర్యటనకు వెళ్లారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగే ఆసియాన్-భారత్ సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఆహ్వానం మేరకు జకార్తా వెళ్తున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఆసియాన్ నాయకులతో భారతదేశ భాగస్వామ్యం యొక్క భవిష్యత్తు రూపురేఖలను చర్చించడానికి తాను ఎదురు చూస్తున్నానని ప్రధాని చెప్పారు. గతేడాది బాలిలో జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశానికి ఇండోనేషియా పర్యటనను గుర్తుచేసుకున్న ప్రధాని మోడీ.. ఈ పర్యటన ఆసియాన్ ప్రాంతంలో భారతదేశ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని అన్నారు.

భారత కాలమానం ప్రకారం.. ప్రధాని మోడీ సెప్టెంబర్ 7న తెల్లవారుజామున 3 గంటలకు జకార్తా చేరుకుంటారు. ఆ తర్వాత ఉదయం 7 గంటలకు ఆసియాన్ ఇండియా సమ్మిట్ వేదికకు బయలుదేరి సదస్సులో పాల్గొంటారు. 8:45 గంటలకు తూర్పు ఆసియా సదస్సులో పాల్గొంటారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే ప్రధాని బయలుదేరి సాయంత్రం 6:45 గంటలకు ఢిల్లీలో దిగుతారు. సెప్టెంబర్ 8న ఢిల్లీలో జరిగే 3 దేశాల అధ్యక్షులతో ప్రధాని ముఖ్యమైన ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కూడా సమావేశం నిర్వహించనున్నారు.