
China: భారతదేశం ప్రతిష్టాత్మకంగా జీ20 సదస్సును నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 9-10 తేదీల్లో అగ్రదేశాల అధినేతలు ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. అయితే భారతదేశానికి అంతర్జాతీయంగా పెరుగుతున్న పలుకుబడిని చూసి డ్రాగన్ కంట్రీ చైనా తట్టుకోలేకపోతోంది. చైనా తన మౌత్‌పీస్ పత్రిక అయిన గ్లోబల్ టైమ్స్ ద్వారా భారతదేశంపై విషాన్ని చిమ్మే కథనాలను ప్రచురిస్తోంది. భారతదేశం అంతర్జాతీయ ప్రభావాన్ని పెంచుకునేందకు జీ20 సదస్సును ఉపయోగించుకుంటుందని వ్యాఖ్యానించింది.
దేశం పేరు మార్చడం కన్నా ఇతర ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టాలని గ్లోబల్ టైమ్స్ లో పేర్కొంది. 1947కి ముందు దేశం స్వాతంత్య్రం పొందిన నాటి ఆర్థిక వ్యవస్థను భారతదేశం సమగ్రంగా సంస్కరించగలదా..? అనేదే ముఖ్యమైన విషయమని, విప్లవాత్మక సంస్కరణలు లేకుండా, భారతదేశం విప్లవాత్మక అభివృద్ధిని సాధించలేదని అంది. భారత్ పెరుగుతున్న ప్రపంచ దృష్టిని ఉపయోగించుకుని దాన్ని వృద్ధికి చోదక శక్తిగా మార్చుకోగలదని ఆశిస్తున్నాము అంటూ చైనా పేర్కొంది.
Read Also: Rahul Gandhi: జీ20 సదస్సుకు ముందు రాహుల్ గాంధీ యూరప్ పర్యటన
రాబోయే జీ20 సమ్మిట్ పై ప్రపంచ దృష్టి కేంద్రీకృతమైన తరుణంలో భారత్ ప్రపంచాన్ని ఏం తెలియజేయాలని అనుకుంటుంది..? అని చైనా ప్రశ్నించింది. పేరు మార్పు వలస రాజ్యాల కాలం పేర్లుగా భావించే వాటిని తొలగించే ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తుందని తన మీడియాలో చెప్పింది. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత మోడీ పరిపాలన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వాల్లో ఒకటిగా ఉందని, భారత్ తన ఆర్థిక వ్యవస్థను సరళీకరించడానికి పెద్ద సంస్కరణల్ని ప్రారంభించిందని.. అయితే దురదృష్టవశాత్తు వాణిజ్య రక్షణవాదం వైపు ఎక్కువగా మారుతోందని చైనా తన నివేదికలో పేర్కొంది. దేశం పేరు మార్చాలా..? వద్దా..? అనే దానికన్నా ముందు ఇవి ముఖ్యమైనవంటూ సూచించింది.
ఇటీవల కాలంలో చైనా కంపెనీలపై భారత్ కఠినంగా వ్యవహరిస్తున్న తరుణంలో.. ప్రపంచానికి తన మార్కెట్లను పూర్తిగా తెరవడంతలో భారత్ సంకోచం అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. జీ20 ప్రెసిడెన్సీపై సలహాలు ఇస్తూ.. భారత్ తన ఆర్థిక వ్యవస్థను సంస్కరించుకోవడానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి , విదేశీ పెట్టుబడిదారులకు న్యాయమైన వ్యాపార వాతావరణాన్ని అందించడానికి జీ20ని ఉపయోగించుకోవాలని సూచించింది.