Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన వివాహేతర సంబంధాన్ని దాచిపెట్టేందుకు ఓ తల్లి కర్కశంగా వ్యవహరించింది. మూడేళ్ల కన్న కొడుకును డాబాపై నుంచి తోసేసి చంపేసింది. తన నిర్వాకాన్ని చూసిన కొడుకు ఎక్కడ కానిస్టేబుల్ అయిన భర్తకు చెబుతాడో అని చంపేసింది. డాబా పైనుంచి పడటంతో తీవ్రగాయాలైన బాలుడు చికిత్స పొందుతూ మరణించాడు. ప్రమాదవశాత్తు డాబా పైనుంచి పిల్లాడు పడిపోయి మరణించారని అనుకున్నారు. అయితే ఆ తరువాత అసలు విషయం తెలిసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. కన్న కొడుకును చంపేసిన తర్వాత, కొడుకు రోజూ పీడకల్లో కనిపిస్తూ వేధించడం ప్రారంభించాడు. దీంతో వీటిని తట్టుకోలేక సదరు తల్లి, భర్త ముందు తాను చేసిన దుర్మార్గాన్ని ఒప్పుకుంది. జ్యోతి రాథోడ్ అనే మహిళ తన పొరుగున ఉన్న వ్యక్తి ఉదయ్ ఇందౌలియా వివాహేతర సంబంధం పెట్టుకుంది.
ఇదిలా ఉంటే జ్యోతి భర్త ధ్యాన్ చంద్ ఏప్రిల్ 28న తన ప్లాస్టిక్ దుకాణం ప్రారంభించాడు. ఈ కార్యక్రమానికి ఉదయ్ తో పాటు చుట్టుపక్కల వారిని ఆహ్వానించాడు. అయితే అదే సమయంలో జ్యోతి, ఉదయ్ ఇద్దరు డాబాపైకి వెళ్లారు. పిల్లాడు కూడా తల్లిని అనుసరిస్తూ డాబాపైకి వెళ్లాడు ఆ సమయంలో జ్యోతి, ఉదయ్ తో అసహజ స్థితిలో కనిపించింది. ఇది చూసిన పిల్లాడు తన తండ్రి ధ్యాన్ చంద్ కి చెబుతాడనే భయంతో పిల్లాడిని డాబా పై నుంచి కిందికి తోసి చంపేసింది. చికిత్స పొందుతూ పిల్లాడు ఏప్రిల్ 29న మరణించాడు.
ఈ ఘటన జరిగిన తర్వాత నుంచి కన్నకొడుకు పీడకలల రూపంలో రావడంతో జ్యోతి తీవ్రంగా భయపడింది. దీంతో జ్యోతి తన భర్త ధ్యాన్ చంద్ కి అసలు విషయం చెప్పింది. ఆమె చెప్పిన నిజాన్ని భర్త రికార్డ్ చేశారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం దీని ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణలో జ్యోతికి తన పొరుగువాడైన ఉదయ్ ఇందౌలియాతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది.