Mohan Bhagwat: రాష్ట్రీక స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. మన సమాజంలో వివక్ష ఉందని, అసమానతలు ఉన్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగాలని బుధవారం ఆయన అన్నారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ సమావేశం ఆయన మాట్లాడారు. 1947లో భారతదేశంతో విడిపోయిన వారు తాము తప్పు చేస్తున్నామని భావిస్తున్న తరుణంలో నేటి యువకులు వృద్ధులుగా మారకముందే ‘అఖండ భారత్’, అవిభాజ్య భారతదేశం సాకారం అవుతుందని ఆయన అన్నారు.
రిజర్వేషన్ల కోసం మరాఠా కమ్యూనిటీ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గతం కొన్ని రోజులుగా మరాఠా కమ్యూనిటీ మహారాష్ట్రలో ఉద్యమం చేస్తున్నారు. మోహన్ భగవత్ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ.. మనం సాంఘిక వ్యవస్థలో మా తోటి మనుషులను వెనక ఉంచామని, మనం వారిని పట్టించుకోలేదని, 2000 ఏళ్ల పాటు ఇది కొనసాగిందని, సమానత్వం మనం తీసుకుంటున్న చర్యల్లో రిజర్వేషన్లు ఒకటని, అటు వంటి వివక్ష ఉన్నంత కాలం రిజర్వేషన్లు కొనసాగించాలని, ఆర్ఎస్ఎస్ దానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందని ఆయన అన్నారు.
మన సమాజంలో ఇప్పటికీ వివక్ష ఉందని ఆయన పేర్కొన్నారు. ఇది ఆర్థిక, రాజకీయ సమానత్వాన్ని నిర్థారించడమే కాకుండా.. గౌరవాన్ని ఇవ్వడమే అని ఆయన అన్నారు. వివక్ష ఎదుర్కొంటున్న వారు 2000 ఏళ్లు బాధపడుతుంటే.. వివక్ష ఎదుర్కోని వాళ్లు మరో 200 ఏళ్లు ఎందుకు ఇబ్బందులను అంగీకరించము..? అని ప్రశ్నించారు. ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ అఖండ భారత్ ఎప్పుడు ఉనికిలోకి వస్తుందో చెప్పలేమని తెలిపారు.
1950 నుంచి 2002 వరకు నాగ్‌పూర్ మహల్ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరేయలేదనే ఆరోపణపై స్పందిస్తూ.. ప్రతీ ఏడాది ఆగస్టు 15, జనవరి 26 తేదీల్లో జాతీయ జెండాను ఎగరేస్తున్నామని అన్నారు. 1933లో జల్‌గావ్ ప్రాంతంలో జరిగిన కాంగ్రెస్ తేజ్‌పూర్ సమావేశంలో జవహర్ లాల్ నెహ్రూ 80 అడుగుల స్తంభంపై జాతీయ జెండాను ఎగరేసిన సంఘటనను గుర్తు చేశారు. ఆ సమయంలో జెండా ఇరుక్కుపోతే ఓ యువకుడు స్తంభాన్ని ఎక్కి సరిచేసిన ఘటనను గుర్తు చేశారు. సుమారు 10,000 మందిలో ఓ యువకుడు ఈ సాహసం చేశాడని.. మరుసటి రోజు నెహ్రూ అతడిని సమావేశానికి హాజరు కావాలని కోరారు, అయితే ఆ యువకుడు ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్తాడని చెప్పడంతో అది జరగలేదని భగవత్ అన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఆ యువకుడి ఇంటికి వెళ్లి ప్రశంసించారని చెప్పారు. ఆ యువకుడి పేరు కిషన్ సింగ్ రాజ్‌పుత్ అని తెలిపారు.