Leading News Portal in Telugu

Sonia Gandhi: ప్రధాని మోడీకి సోనియా గాంధీ లేఖ.. లేఖలో 9 అంశాలు


Sonia Gandhi: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు, జమిలి ఎన్నికలు, ఇండియా పేరు భారత్ గా మార్పు, మహిళా రిజర్వేషన్ వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారం ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. లేఖలో ప్రధానంగా 9 అంశాలను ప్రస్తావించారు. ఈ నెల 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటు కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చింది. అయితే సమావేశాల ఎజెండా మాత్రం ఇప్పటి వరకు తెలియలేదు. ఈ నేపథ్యంలో సోనియాగాంధీ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

లేఖలోని 9 అంశాలు:

1) నిత్యావసరాల ధరలు, పెరుగుతున్న నిరుద్యోగం, అసమానతల పెరుగుదల, ఎంఎస్ఎంఈ సమస్యలు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై దృష్టి పెట్టాలి.

2) రైతులు, రైతు సమస్యలు, మద్దతు ధర, ఇతర రైతు డిమాండ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

3) అదానీ వ్యవహారంపై జేపీసీ కోసం డిమాండ్..

4) మణిపూర్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు. రాష్ట్రంలో ప్రభుత్వం విఫలం అవ్వడం

5) హర్యానాలో మతపరమైన ఉద్రిక్తతలు పెరగడం.

6) చైనా భారత భూభాగన్ని ఆక్రమించడం. లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో మన సార్వభౌమధికారానికి సవాళ్లు.

7) కుల గణనపై చర్యలు తీసుకోవడం.

8) కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతినడం

9) కొన్ని రాష్ట్రాల్లో విపరీతమైన వరదలు

ఇతర రాజకీయ పార్టీలతో ఎటువంటి సంప్రదింపులు లేకుండా సమావేశాలు ఏర్పాటు చేశారని సోనియా గాంధీ ఆరోపించారు. నిర్మాణాత్మక సహకార స్పూర్తితో సమస్యలపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆమె లేఖలో పేర్కొన్నారు. రాబోయే సమావేశంలో అదానీ అంశాన్ని లేవనెత్తాలని విపక్షాలు నిర్ణయించాయి. ఇండియా కూటమి మొదటి బహిరంగ ర్యాలీని మధ్యప్రదేశ్ లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తన నివాసంలో ఇండియా కూటమిలోని పార్టీలను నేతలతో సమావేశమయ్యారు. అజెండా లేకుండా మోడీ సర్కార్ పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేస్తోందని ఆరోపించారు.