Leading News Portal in Telugu

G20 Summit: “జై సియా రాం”తో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కి స్వాగతం..


G20 Summit: జీ20 సమావేశాలకు దేశాధినేతలు తరలివస్తున్నారు. ఒక్కొక్కరుగా దేశాధినేతలు, కీలక వ్యక్తులు న్యూఢిల్లీకి చేరుకుంటుండటంతో సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఢిల్లీకి చేరుకున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మోలొని, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసో, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, ఒమన్ ప్రధాని సుల్తాన్ హైతం బిన్ తారిక్ అల్ సయీద్ ఢిల్లీకి చేరుకున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భారతదేశానికి వచ్చారు.సెప్టెంబర్ 9-10 తేదీల్లో జీ20 సమావేశాలు జరగనున్నాయి.

యూకే ప్రధాని రిషి సునాక్, ఆయన భార్య అక్షతామూర్తికి కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే పాలం అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ‘జై సియా రాం’ అంటూ కేంద్ర మంత్రి వీరిద్దరిని రిసీవ్ చేసుకున్నారు. రిషి సునాక్ దంపతులకు భగవద్గీత, హనుమాన్ చాలీసాని, రుద్రాక్షను బహూకరించారు. తన భారత పర్యటన చాలా ప్రత్యేకమైందిగా రిషి సునాక్ అన్నారు. రిషిసునాక్ ఇన్ఫోసిన్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని వివాహమాడారు. తొలి భారత-బ్రిటిష్ సంతతి ప్రధానిగా ఉన్నారు.

తన మూడు రోజుల పర్యటనలో భాగంగా రిషి సునాక్ ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ఇరు దేశాల మధ్య చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న స్వేచ్చా వాణిజ్యం ఒప్పందం గురించి ఇరు దేశాధినేతలు చర్చించనున్నారు. జీ20 సమావేశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇండియా అందుకు తగ్గట్లుగానే భారీగా ఏర్పాట్లు చేసింది. ఈ సమావేశాలకు 40కి పైగా దేశాధినేతలు, ఇతర నాయకులు, అధికారులు హాజరవుతున్నారు.