Leading News Portal in Telugu

Maharashtra: మంత్రికి అవమానం.. పసుపు చల్లిన వ్యక్తి.. కారణమదే


Man Throws Haldi On Minister in Maharashtra: నిరసనలను ఒక్కొక్కరు ఒక్కో విధంగా తెలియజేస్తూ ఉంటారు. నాయకులు మాట్లాడేటప్పుడు వారిపై చెప్పులు విసరడం, రాళ్లు వేయడం, వాటర్ బాటిల్స్ విసరడం లాంటివి మనం తరచూ చూస్తూనే ఉంటాం. అయితే అలాగే పసుపు చల్లి నిరసన తెలిపాడు ఓ వ్యక్తి. ఏకంగా మంత్రి పక్కనే నిలబడి ఆయనపై పసుపు చల్లాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇందులో ధంగర్ వర్గానికి రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఇద్దరు వ్యక్తులు మహారాష్ట్ర రెవిన్యూ మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్‌ ను కలిశారు. అయితే ఆయన వినతి పత్రాన్ని తెరచి దానిలో ఉన్నది చదువుతూ ఉన్నారు. అంతలో ఊహించని ఘటన జరిగింది. వారిద్దరిలో ఒకరైనా శేఖర్ భంగలే అనే జేబులో నుంచి పసుపు తీసి మంత్రి పై చల్లాడు. దీంతో మంత్రితో సహా అక్కడ ఉన్నవారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మంత్రి సిబ్బంది ఆ యువకుడిని పక్కకు నెట్టేశారు. అంతేకాకుండా అతనిపై పిడిగుద్దులు కురిపించారు మంత్రి అనుచరులు. సోలాపూర్ జిల్లాలో ఉన్న  ప్రభుత్వ విశ్రాంతి భవనంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ వ్యక్తిని వదిపెట్టాలని ఏం చేయవద్దని మంత్రి తన అనుచరులను ఆదేశించారు. పసుపు చల్లడాన్ని తాను అవమానకరంగా భావించడం లేదని పసుపు ఎంతో పవిత్రమైనదని మంగళకరమైనదని మంత్రి అన్నారు.

ఇక ఇలా పసుపు చల్లడంపై ఆ వ్యక్తి మాట్లాడుతూ ఇలా చేసినందుకు తానేమీ బాధపడటం లేదన్నాడు. తమ వర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనే తాను అలా చేశానని తెలిపారు. తమ వర్గం వారు చాలా వెనుకబడి ఉన్నారని వారిని ఎస్టీ కేటగిరిలో చేర్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకపోతే ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద నల్ల రంగు చల్లుతానని హెచ్చరించాడు. ప్రస్తుతం మంత్రి మీద పసుపు చల్లే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.