Leading News Portal in Telugu

Manipur Violence: మణిపూర్‌లో టెన్షన్ టెన్షన్.. భద్రతా బలగాలు, సాయుధులకు మధ్య కాల్పులు


Manipur Violence: గత నాలుగు నెలలు మణిపూర్ రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణలు తలెత్తుతూనే ఉన్నాయి. శాంతి నెలకొంటుందనుకునే సందర్భంలో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరోసారి మణిపూర్ లో టెన్షన్ వాతావరణం తలెత్తింది. భద్రతా బలగాలు, సాయుధ సిబ్బంది మధ్య తాజాగా కాల్పులు చోటు చేసుకోవడంతో ఉద్రిక్తంగా మారింది. తెంగ్నౌపాల్ జిల్లాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

శుక్రవారం తెల్లవారుజామున మణిపూర్‌లోని తెంగ్నౌపాల్ జిల్లాలోని పల్లెల్ ప్రాంతంలో భద్రతా బలగాలు, సాయుధ వ్యక్తుల మధ్య కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటలకు నుంచి ప్రారంభమైన కాల్పులు అడపాదడపా కొనసాగుతున్నాయి. భద్రతా బలగాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. అంతకుముందు బుధవారం బిష్ణుపూర్ జిల్లాలోని ఫౌగాగ్ చావో ఇఖాయ్ లో వేలాది మంది గుమిగూడి ఆర్మీ బారికేడ్లను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత తాజా కాల్పులు చోటు చేసుకున్నాయి. బుధవారం జరిగిన ఘటనలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసు బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించి అల్లర్లను అదుపు తెచ్చే క్రమంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నిరసనలకు ఒక రోజు ముందు మణిపూర్ లోని 5 లోయ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు.

ఈ ఏడాది మే3న మణిపూర్ లో జాతుల మధ్య హింస చెలరేగింది. మెయిటీ, కుకీ వర్గాలు ఒకరిపై ఒకరు, గ్రామాలపై దాడులు చేసుకుంటూ, ఇళ్లను తగలబెట్టుకున్నారు. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరక్ు 160 మందికి పైగా చనిపోయారు. వందల మంది గాయపడ్డారు. ఎస్టీ హోదా కోసం మెజారిటీ మెయిటీ కమ్యూనిటీ డిమాండ్ చేయడం, దీన్ని కూకీలు వ్యతిరేకించడంతో తగాదా ప్రారంభమైంది. మణిపూర్ జనాభాలో 53 శాతం మెయిటీలు 10 శాతం ఉన్న ఇంఫాల్ లోయ ప్రాంతంలో ఉంటే 40 శాతం మైనారిటీ కుకీలు 90 శాతం ఉన్న కొండ ప్రాంతాల్లో ఉంటున్నారు. ఇదే ఈ రెండు తెగల మధ్య వివాదానికి కారణమైంది.